పోరాటాల వారసత్వాన్ని నిలబెట్టిన కార్మికులు - Tolivelugu

పోరాటాల వారసత్వాన్ని నిలబెట్టిన కార్మికులు

telangana fighting spirit continuing by rtc employees, పోరాటాల వారసత్వాన్ని నిలబెట్టిన కార్మికులు

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటిన ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకత ఉంది. ఈ ప్రాంతం చారిత్రాత్మకంగా ఉద్యమాలకు, పోరాటాలకు నిలయం. కాకతీయుల కాలంనాటి నుండి సమ్మక సారక్క దగ్గర్నుండి నిజాంకు వ్యతిరకంగా జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఆ తరువాత కాలంలో జరిగిన సిరిసిల్ల-జగిత్యాల రైతాంగ పోరాటాలు, గోదావరిలోయలో జరిగిన పోరాటాలు, ఉస్మానియా కాకతీయ యునివర్సిటీలలో జరిగిన విద్యార్థి ఉద్యమాలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉద్యమాలు చేసిన నేల తెలంగాణ.

అనేక మంది వీరులను కన్న గడ్డ ఈ తెలంగాణ. కొమరం భీం, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య లాంటి వారు అనేకమంది వీరోచితంగా పోరాడి తమ ప్రాణాలను బలిదానం చేసిన చరిత్ర తెలంగాణకు ఉంది. ఆ పోరాట స్ఫూర్తితోనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సాగింది. ఆ ఉద్యమానికి జనం కదిలారు. రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ఆర్టీసీ సమ్మె సందర్భంగా రాజకీయ వర్గాలు పాత విషయాలు గుర్తు చేసుకుంటున్నాయి. అయితే కేసీఅర్ ఉద్యమ సమయంలో గతంలో విప్లవ పార్టీలలో వామపక్ష పార్టీలలో ప్రజాసంఘాలలో పనిచేసి వారిని దగ్గర కు తీసుకొని వారి సలహాలు సూచనలు తీసుకొని వారికి ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణ వచ్చాక వారిని వదిలేయకుండా తెలివిగా వారికి పదవులు ఇచ్చి కట్టిపడేసారు. దీంతో వారు పెదవులు మూశారు. తెలంగాణ ఉద్యమకారులుగా వామపక్ష మేధావులుగా ప్రజా కవులుగా, కళాకారులుగా పేరున్న వాళ్ళు కేసీఆర్ ఇచ్చిన పదవులకు పెదవులు మూసి తెలంగాణ సమాజంలో ఏ ఉద్యమం జరిగిన ఏ ఆందోళన జరిగినా తమకు తెలియనట్లు వ్యవహరిస్తున్నారు.నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు.

తెలంగాణకున్న పోరాట స్ఫూర్తిని, తెగువను గత పోరాటాల వారసత్వాన్ని మంటకలిపే విధంగా మౌనం గా ఉంటూ వస్తున్నారు అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వీరు పదవులను కాపాడుకోవడానికి కేసీఆర్ ని పొగడడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం తెలంగాణ సహజత్వానికి భిన్నమైనది అంటున్నారు. వీరి మౌనం రాజకీయ చైతన్యాన్ని మొద్దుబార్చడమే కాకుండా భవిష్యత్‌ తెలంగాణకు పోరాటాల చరిత్ర తెలియకుండా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కారు చీకటిలో కాంతి రేఖలా ఆర్టీసీ కార్మికులు తెలంగాణ పోరాట వారసులుగా మేము ఉన్నాం, మాలో పోరాట స్ఫూర్తి చావలేదు, పదవుల కోసం కొందరు మేధావులు తెలంగాణ ఉద్యమ కారులుగా చెప్పుకునే వారు కేసీఆర్ అడుగులకు మడుగులు ఒత్తినా మేము మా హక్కులకోసం తెలంగాణ అమరవీరుల అందించిన స్ఫూర్తితో ఉద్యమాన్ని నడుపుతున్నారు అని కార్మికులను కొనియాడుతున్నారు. ప్రభుత్వం నుండి ఎన్ని బెదిరింపులు వచ్చినా, కుటుంబాల్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, వాటిని తట్టుకొని సమ్మెను కొనసాగించడం నిజంగా ఇంకా తెలంగాణకు ఉన్న పోరాటాల చరిత్ర మాసిపోలేదు, ప్రజలు మరిచిపోలేదు అని కార్మిక లోకం నిరూపించింది అని అంటున్నారు. కేవలం కొందరు స్వార్థపరులు మాత్రమే వారి సుఖ సంతోషాలకు కేసీఆర్ మెప్పుకోసం తమ ప్రాపకంకోసం పరితపిస్తూ ఉద్యమాలకు వెన్నుపోటు పొడుస్తున్నారు.

కార్మికులు గత నెల రోజులుగా సమ్మె చేస్తున్నా మేధావులు పెదవులు విప్పకుండ ఉండటం దుర్మార్గం అంటున్నారు. ఆర్టీసీ కార్మికులకు సెల్యూట్ చేస్తున్నారు. కేసీఅర్ ఇచ్చిన గడువును బేఖాతరు చేసి పోరాట తెగువ చూపించి, తెలంగాణ బిడ్డలు అనిపించారు. పదవులు శాశ్వతం కాదు… చరిత్ర శాశ్వతం. అందులో మన పాత్ర హీరోనా… విలనా అన్నది నిర్ణయించుకోవాలని అంటున్నారు. కొందరు తెలంగాణ ఉద్యమ సమయంలో హీరోలు అనిపించుకుని ఇప్పుడు పదవులకోసం వచ్చిన పదవులు కాపాడుకోవడం కోసం ప్రజల దృష్టిలో విలన్స్‌లా వ్యవహరిస్తున్నారని చెప్పుకొస్తున్నారు.

మొత్తానికి తెలంగాణ ఏమైపోతుందో ఎటు వెళుతుందో ఉద్యమ స్ఫూర్తి ఏటుపోయిందో అనే భయాన్ని ఆర్టీసీ కార్మికులు పోగొట్టారు అని ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా పదవుల కోసం పెదవులు మూసిన మేధావులు బుద్ధి జీవులు తెలంగాణ కోసం నోరు తెరవాలని కోరుకుంటున్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp