తెలంగాణలో కారణం ఏదైనా ప్రభుత్వం 50వేల పోస్టుల భర్తీ కోసం కసరత్తు ప్రారంభించింది. గ్రేటర్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ఓటమి అనంతరం సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన, వచ్చి రాగానే 50వేల పోస్టుల భర్తీకి ఆగమేఘాల మీద అనుమతులివ్వటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే, తెలంగాణలో ఖాళీల భర్తీ ఎలా జరుగుతుందన్నది కీలకంగా మారింది. భర్తీ చేసే ఉద్యోగాల్లో ఎక్కువగా జిల్లా స్థాయి పోస్టులే ఉన్నాయి. కొన్ని జోనల్ పోస్టులుండనున్నాయి. కానీ తెలంగాణలో జిల్లాల సంఖ్య 10 నుండి మొదట 31కి, ఆ తర్వాత 33కు చేరింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 31జిల్లాల తెలంగాణకే ఆమోదం ఉండగా… ములుగు, నారాయణపేట జిల్లాలను ఇంకా కేంద్రం అధికారికంగా గుర్తించలేదు. పైగా వికారాబాద్ జిల్లా జోనల్ మార్పు కూడా ఇంకా గెజిట్ కాలేదు.
మరోవైపు పాత జిల్లాల ప్రకారమే అంటే 10జిల్లాల ప్రకారమే నోటిఫికేషన్లు ఇచ్చే ఆలోచన కూడా ఉందన్న ప్రచారం జరుగుతున్నా… టెక్నికల్ గా అది సాధ్యపడేలా లేదు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉన్న నేపథ్యంలో అమలులో లేని పాత జిల్లాల ప్రకారం భర్తీ నోటిఫికేషన్ ఇచ్చేలా కనపడటం లేదు. అలా అని 33జిల్లాలను తీసుకొని ఇచ్చే ఆస్కారం లేకుండా పోయినట్లు తెలుస్తోంది. దీంతో 31జిల్లాల ప్రాతిపదికనే నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.