ఉద్యమ తెలంగాణలో కీలకంగా ఉండి, సీఎం కేసీఆర్ అంటేనే ఒంటికాలిపై లేచే విజయశాంతి సొంతగూటికి చేరనుందా…? తెలంగాణ ప్రజల్లో తనకంటూ గుర్తింపు ఉన్న రాములమ్మ ఎంట్రీ బీజేపికి కలిసివస్తుందా…? విజయశాంతి కేసీఆర్‌పై చేసిన పోస్ట్‌లో బీజేపి చేరికపై చెప్పకనే చెప్పిందా…?
బీజేపిలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న సందర్భంలోనూ… తల్లి తెలంగాణ పార్టీతో తెలంగాణ ఉద్యమానికి తనవంతు పోరాడిన విజయశాంతికి తెలంగాణలో మంచి ఫాలోయింగ్ ఉంది. రాములమ్మగా జనం విజయశాంతిని ఇప్పటికీ ఆదరిస్తారు. అయితే, కాంగ్రెస్‌లో ఉన్న విజయశాంతి క్యాంపెయిన్ కమిటీ చైర్మన్‌గా కూడా ఉన్నారు.
అయితే, మారిన పరిస్థితుల నేపథ్యంలో… విజయశాంతి తిరిగి సొంతగూటికి చేరనున్నారు అని ప్రచారం సాగుతోంది. అందుకు విజయశాంతి చేస్తున్న కామెంట్స్ కూడా ఊతం ఇస్తున్నాయి. తాజాగా సీఎం కేసీఆర్ టార్గెట్‌గా విజయశాంతి ఒక పోస్ట్ పెట్టింది. అందులో రామమందిర నిర్మాణం, తీర్పుపై దేశం సంబరాలు చేసుకుంటుందని… ఎంఐఎంతో అవగాహన ఉండబట్టే కేసీఆర్ నోరు మెదపటం లేదంటూ ఓ ఫక్తు బీజేపి నేత మాట్లాడినట్లుగా వ్యాఖ్యానించింది. నిజానికి బీజేపి రాష్ట్ర నేతలు కూడా ఎవరూ ఇలా కేసీఆర్-ఓవైసీని అయోధ్య తీర్పుపై విమర్శించలేదు. అయోధ్య తీర్పుపై రాష్ట్ర కాంగ్రెస్ మౌనం వహించగా, ఏఐసీసీ సుప్రీం తీర్పును గౌరవిస్తున్నాం అని మాత్రమే ప్రకటించటం విశేషం. కాంగ్రెస్ నేతలు ఎవరూ అయోధ్య తీర్పుపై పార్టీ లైన్ దాటరాదని ఏఐసీసీ ముందే ఆదేశాలు జారీ చేసింది.
దీంతో… రాములమ్మ బ్యాక్ టు బీజేపి వే సిద్ధం చేసుకుంటుందా అని కాంగ్రెస్‌లో చర్చ మొదలైంది. ఇప్పట్లో కాంగ్రెస్ పుంజుకునే అవకాశం కనపించకపోవటం, పైగా బీజేపి రాష్ట్రంలో బలపడుతున్న దశలో విజయశాంతి కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని, ఫైర్ బ్రాండ్ అందులోనూ లేడీ కావటం బీజేపికి-విజయశాంతికి కలిసివస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపిలో మంచి పరిచయాలు ఉన్న విజయశాంతికి కేంద్రంలో మంచి పదవి కట్టబెట్టే అవకాశం లేకపోలేదని… తద్వారా రాష్ట్రంలో బీజేపి బలపడేందుకు విజయశాంతి కీ రోల్ పోషించేవిధంగా ప్లాన్ ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు.
ALSO READ:
అయోధ్యపై కేసీఆర్ మౌనం ఓవైసీ కోసమేనా?