- బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో స్పెషల్ మెనూ
- నోరూరించే తెలంగాణ రుచులు.. పిండి వంటలు
- సామాన్యురాలి చేతి వంట రుచి చూడనున్న ప్రధాని
బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బిజెపి అగ్రనేతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ బిజెపి శాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ సందర్భంగా కార్యవర్గ సమావేశాలకు వస్తోన్న ప్రముఖ నేతలకు ఎలాంటి వంటకాలు తయారు చేస్తున్నారనే చర్చ ఆసక్తికరంగా మారింది. అయితే, అంచనాలకు భిన్నంగా అథితులు, బిజెపి శ్రేణులకు తెలంగాణ సంప్రదాయ వంటల రుచి చూపించాలని నిర్ణయించారు. దీంతో తెలంగాణ స్పెషల్ వంటకాలను ఏరికోరి మెనూలో చేర్చారు. తెలంగాణ వంటలు చేసే కరీంనగర్ జిల్లాకు చెందిన గూళ్ల యాదమ్మ అనే మహిళను ఎంపిక చేయడం ఆసక్తికరంగా మారింది.
దేశ ప్రధానికి వండి, వడ్డించడమంటే… ఫైవ్ స్టార్ హోటల్ లో చేయి తిరిగిన నలభీములు అయ్యుండాలి కదా..! కానీ.. హైదరాబాద్ రానున్న ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఓ సామాన్యురాలి చేతి వంట రుచి చూడబోతున్నారు. ఆ మహిళ అతి సామాన్యురాలైనా.. తెలంగాణ వంటకాల తయారీలో మాత్రం అసామాన్యురాలే… అందుకే ఆమెను ఏరికోరి ఎంపికచేశారు.
జులై 2,3 న జరిగే బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యే ప్రధాని నరేంద్రమోదీకి అచ్చ తెలంగాణ వంటలు రుచి చూపించాలని నిర్ణయించారు. అందుకే, కరీంనగర్ జిల్లాకు చెందిన గూళ్ల యాదమ్మను ఎంపికచేశారు. 29 సంవత్సరాలుగా వంటలు చేస్తూ ఆమె జీవనాధారం కొనసాగిస్తున్నారు. యాదమ్మ స్వగ్రామం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి గ్రామం. 15వ ఏటనే కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన వ్యక్తితో వివాహమైంది. దీంతో కరీంనగర్ చేరుకున్న యాదమ్మ మంకమ్మతోటలో వెంకన్న అనే వ్యక్తి దగ్గర వంటలు నేర్చుకున్నారు. ఈమె చేసే శాకాహార, మాంసాహార వంటకాలు తిన్నవారు ఆహా అనకుండా ఉండలేరని చెబుతారు. ముఖ్యంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన సమావేశాల సందర్భంగా వంటలు చేయడంతో యాదమ్మకు మంచి గుర్తింపు వచ్చింది.
ఒకేసారి 10వేల మందికి కూడా వండివార్చే నేర్పరితనం యాదమ్మ సొంతం. దీంతో పెద్ద సభలు, భారీ కార్యక్రమాలకు చాలామంది ఆమెనే పిలుస్తుంటారు. ఇప్పుడు బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా బిజెపి తెలంగాణ చీఫ్ బండి సంజయ్ యాదమ్మతో వంటలు చేయించాలని నిర్ణయించారు. ఆయన నుంచి పిలుపు అందిన వెంటనే యాదమ్మ హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్‌కి వస్తున్న మోదీ సారుకి నువ్వే వంటలు చేయాలని చెప్పడంతో యాదమ్మ ఆనందానికి అవధుల్లేకుండా పోయిందని ఆమె తెలిపారు. దేశ ప్రధానికి వండి, వడ్డించడమంటే అంతకంటే భాగ్యం ఏముంటుందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారామె.
ముఖ్యంగా ప్రధాని రుచి చూడబోయే వంటకాలేవో తెలిస్తే నోరూరాల్సిందే. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ప్రిపేర్ చేసిన మెనూలో పులిహోర, పప్పు అన్నం, దద్దోజనం, బగార వంటి ఐదారు రకాల వంటలు, గంగవాయిలి కూర పప్పు, పచ్చిపులుసు, సాంబారు, గుత్తి వంకాయ వంటి కూరగాయలు ఉన్నాయి. అంతేకాకుండా తెలంగాణ ఫేమస్ అయిన సకినాలు, సర్వపిండి, అరిసెలు, భక్షాలు, పాయిసం, పప్పుగారెలు వంటివి కూడా తయారు చేయనున్నారు. మొత్తానికి తెలంగాణ వంటకాలతో దేశ ప్రముఖులు, రాజకీయ నాయకులకు అతిథ్యం ఇవ్వనున్నారు.