తెలంగాణలో బీజేపీకి ఉన్న నలుగురు ఎంపీల్లో గ్రూపులు మొదలయ్యాయా…? కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, అధ్యక్షుడు బండి సంజయ్ వర్గాలు చెరోదారిలో ప్రయాణిస్తున్నాయా…? పదవుల ఆశలతో ఎవరికి వారే లాబియింగ్ మొదలుపెట్టారా…?
ఇప్పుడివే ప్రశ్నలు తెలంగాణ బీజేపీలో హాట్ టాపిక్ గా మారాయి. కారణం ఏదైనా తెలంగాణలో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకొని సత్తా చాటింది. కానీ ఆ తర్వాతే అసలు రాజకీయం మొదలైపోయిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ మధ్య గ్యాప్ ఉందన్న వార్తలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ చక్కర్లు కొట్టాయి. కానీ ఎన్నికల వేడిలో అవి పెద్దగా హైలెట్ కాలేదు. కానీ ఇప్పుడు మరోసారి నేతల ఆధిపత్య పోరు మొదలైందన్న వాతావరణం కనపడుతుందని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బాపురావు ఓ వర్గంగా… బండి సంజయ్ తో పాటు ఎంపీ అరవింద్ ఒక వర్గంగా ఉంటున్నారన్న చర్చ సాగుతుంది. త్వరలో కేంద్రమంత్రివర్గ ప్రక్షాళన జరిగే అవకాశం ఉందని… రాబోయే రాజకీయ సమీకరణాల దృష్ట్యా తెలంగాణకు మరో మంత్రి పదవి దక్కనుందని తెలుస్తోంది. ఇప్పటికే కిషన్ రెడ్డి పదవిలో ఉండగా, బండి సంజయ్ పార్టీ బాధ్యతల్లో ఉన్నారు కాబట్టి ఆయనకు పదవి ఇచ్చే అవకాశం లేదు. ఇక మిగిలింది అరవింద్, బాపురావులే. గిరిజన నేత అయిన బాపురావు తనకు మంత్రివర్గంలో అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు. అందుకు కిషన్ రెడ్డి కూడా సహాకరిస్తున్నారని, అరవింద్ కు దక్కకుండా కిషన్ రెడ్డి పావులు కదుపుతున్నట్లు పార్టీలో చర్చ సాగుతుంది. తనపై ఉన్న కేసులు, ఇతర ఇబ్బందుల దృష్ట్యా బాపురావు కిషన్ రెడ్డితోనే సఖ్యతగా ఉంటున్నారని… అందుకే ఇటీవల తెలంగాణకు కాబోయే సీఎం కిషన్ రెడ్డి అంటూ వ్యాఖ్యానించినట్లు పార్టీలో నేతలు అంచనా వేస్తున్నారు. అందుకే ఆయన ఈ మధ్య కిషన్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తున్నారని, కిషన్ రెడ్డి కూడా బాపురావుకు మద్ధతు పలుకుతున్నట్లు చర్చ సాగుతుంది.
ఇటు కిషన్ రెడ్డి కూడా భవిష్యతులో సంజయ్, అరవింద్ తనకు పోటీ అవ్వకూడదని ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు అన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. ఇప్పటికే బండి సంజయ్ దూకుడు వల్ల తమకు ఇబ్బందిగా ఉందని, ఇక అరవింద్ కానీ సంజయ్ కు గాని కేంద్రమంత్రి పదవి వస్తే తన ప్రాబల్యం మరింత తగ్గిపోతుంది అని కిషన్ రెడ్డి భావిస్తున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతుంది.
ఇప్పుడిప్పుడే పార్టీ కుదుటపడుతుందనుకుంటున్న సమయంలో… ఉన్న నలుగురు ఎంపీల్లోనూ మళ్లీ గ్రూపులా అంటూ బీజేపీ శ్రేణులు పెదవి విరుస్తున్నాయి.