కరుణాకర్, తొలివెలుగు ప్రతినిధి
గవర్నర్‌గా తమళిసై రాష్ట్రానికి ఏ పని మీద వచ్చారో ఆ పని మొదలుపెట్టారా? కేసీఆర్‌కు ముకుతాడు వేసే ముహూర్తం పెట్టేశారా ? ప్రగతి భవన్ దూకుడుకు పగ్గాలు వేసే కేంద్రంగా రాజ్‌భవన్ రూపుదాల్చబోతోందా? గవర్నర్ బంగ్లా మరో పాలనా కేంద్రం కాబోతుందా ? తమళిసై ముందున్ను టాస్క్ ఏమిటి? తమిళ శివంగితో ఇక తెలంగాణ వృద్ధ సింహం ఆటలు సాగవన్న మాటలు నిజం కాబోతున్నాయా…?
హైదరాబాద్ : ఇన్నాళ్లూ కేసీఆర్ పట్టించుకోని రాజ్యంగబద్ధ అంశాల్లో కొత్త గవర్నర్ చురుగ్గా దృష్టి పెడుతున్నట్టుగా వాతావరణం కనిపిస్తోంది. గవర్నర్‌గా నరసింహాన్ ఉన్న సమయంలో కేసీఆర్ ఆడిందే ఆటగా సాగింది. కొన్ని విషయాల్లో కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలను ఆయన చూసి చూడనట్లుగా వ్యవహరించారు. అప్పట్లో ఉప కులపతుల విషయంలో ఆయా రంగాల్లో ప్రముఖులను యూనివర్శిటీల బాధ్యులుగా నియమిస్తామని ప్రకటించారు. కానీ అది అలా అటకెక్కిపోయింది.
యూనివర్శిటీల్లో నాణ్యత ప్రమాణాలు, యూనివర్శిటీల పాలన అంతా దయనీయంగా మారిపోయాయి. పైగా వీసీల పదవీకాలం కూడా ముగిసి రెండు నెలలు దాటుతున్న కేసీఆర్ సర్కార్ పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం యూనివర్శిటీలన్నీ ఇంచార్జీల పాలనలో నడుస్తున్నాయి. ఏ యూనివర్శిటీలోనూ కొత్తగా నియామకాలు జరగటం లేదు. సరైన వసతులు లేవన్న కారణంతో… కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్ కూడా తగ్గిపోతున్నాయి. తెలంగాణ ఉద్యమానికి ఆయువు పట్టుగా నిలిచిన ఓయూ ఇటీవలే 100 సంవత్సరాల పండుగ పూర్తిచేసుకుంది. ప్రభుత్వం నిధులు కేటాయించక పోవటంతో వందేళ్ల కానుకగా న్యాక్ గుర్తింపు కూడా కోల్పోయింది. తెలంగాణ ఉద్యమంలో మరో కీలక ప్రాంతమైన కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్శిటీ పరిస్థితి కూడా అంతే. యూనివర్శిటీ మొదలైన నాటి నుంచి నేటి వరకు పూర్తిస్థాయి నియామకాల జోలికే వెళ్లలేదు.
ఈ రెండే కాదు… తెలంగాణ యూనివర్శిటీలన్నీ ప్రస్తుతం అంపశయ్యపై ఉన్నాయి. యూనివర్శిటీల్లో దాదాపు 10వేలకు పైగా పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయి. కాగ్ కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఇదే అంశంపై అక్షింతలు వేసింది. ఈ ప్రభుత్వం విద్యాశాఖపై అతి తక్కువ ఖర్చు చేస్తోందంటూ కుండబద్ధలు కొట్టింది.
కానీ, కొత్త గవర్నర్ రాగానే, విద్యాశాఖపై వాకబు చేశారు. అప్పట్లోనే ఈ కొత్త వీసీల అంశంతో పాటు, ప్రస్తుతం రాష్ట్రంలో యూనివర్శిటీల పరిస్థితి, ఎందుకు ఖాళీలను పట్టించుకోవటం లేదు, మౌలిక వసతుల కల్పన కోసం కేటాయించిన బడ్జేట్ లాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అందుకే అక్టోబర్ 3న విద్యాశాఖపై గవర్నర్ పూర్తిస్థాయి రివ్యూ సమావేశం ఉంది. సరిగ్గా ఈ సమావేశానికి ముందు యూనివర్శిటీలకు వీసీల కోసం ప్రభుత్వం త్రిసభ్య కమిటీలను వేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
దీంతో గతంలో లాగే ఇప్పుడు అన్ని ఆటలు సాగవని, కొన్ని అంశాల్లో గవర్నర్ తన విచక్షణ ఉపయోగించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజ్‌భవన్ కేంద్రంగా రాష్ట్రంలో భిన్న రాజకీయ వాతావరణం ఏర్పడే అవకాశం కనపడుతోందని, అందుకే రాజ్‌భవన్ వేదికగా ప్రజా దర్భార్ ఏర్పాటు జరుగుతోందని, ఇప్పుడు విద్యాశాఖపై గవర్నర్ దృష్టి పెట్టడం కూడా అందులో భాగమని రాజకీయ విశ్లేషకలు అంచనా వేస్తున్నారు.