తెలంగాణ ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్ రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా విడుదలైన మొదటి 10 రోజుల పాటు ప్రత్యేక టిక్కెట్ ధరలను నిర్ణయించడానికి ఓకే చెప్పింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. సినిమా రిలీజ్ అయిన తర్వాతి మూడు రోజుల వరకు ఏసీ థియేటర్లలో టికెట్ పై రూ.50 అధికంగా పెంచుకోవచ్చు. ఆ తర్వాత ఏడు రోజుల వరకు రూ.30 చొప్పున పెంచాలి. మల్టీప్లెక్స్ థియేటర్స్, ఐమాక్స్ థియేటర్లలో మొదటి మూడు రోజులు రూ.100.. తర్వాత వారం రోజులు రూ.50 పెంపునకు అవకాశం ఉంది.
నాన్ ఏసీ థియేటర్ల విషయంలో మాత్రం రేట్ల పెంపు లేదని స్పష్టం చేసింది. అలాగే బెనిఫిట్ షో కు ఓకే చెప్పింది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి ఒంటి గంట మధ్య ఐదు ఆటలు ప్రదర్శించుకునే వెసులుబాటు కల్పించింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన ఆర్‌ఆర్‌ఆర్ 25న విడుదల అవుతోంది. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. రిలీజ్ అయిన తొలిరోజు టార్గెట్ రూ.200 కోట్లు వసూలు అవుతాయని అంచనా వేశారు క్రిటిక్స్.