సంక్రాంతి పండుగ వేళ ప్రభుత్వ ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత కొంతకాలంగా ఉపాధ్యాయులు బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా బదిలీలకు నోచుకోవడం లేదు. అలాగే పదోన్నతులు కూడా కల్పించక చాలా కాలం అయింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆదివారం ఉపాధ్యాయ నాయకులతో మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యాధికారులు సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో తమ ఇబ్బందులు, సమస్యలతో పాటు పలు విజ్ఞప్తులు కూడా మంత్రులకు విన్నవించారు. వీటిపై మంత్రులు సానుకూలంగా స్పందించారు. ప్రధానంగా బదిలీలు, ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరో రెండు, మూడు రోజుల్లో ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. ఫిబ్రవరి 10వ తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసే విధంగా ఈ షెడ్యూల్ ఖరారు చేశారు.
ఫిబ్రవరిలో ఈ ప్రక్రియ ముగిసినప్పటికీ బదిలీలు మాత్రం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలులోకి వచ్చే విధంగా విధివిధానాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. నిజానికి ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరినప్పటికీ 317 ఉత్తర్వుల వల్ల కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉపాధ్యాయుల కేటాయింపు జరిగింది. కేజీబీబీ, మోడల్ స్కూల్ లోనూ బదిలీలు చేపట్టనున్నారు.
కౌన్సిలింగ్ ద్వారా పూర్తి పారదర్శకంగా బదిలీల ప్రక్రియ నిర్వహించనున్నట్టు మంత్రులు తెలిపారు. పండగ పూట తెలంగాణ ప్రభుత్వం చెప్పిన ఈ గుడ్ న్యూస్ తో ఉపాధ్యాయుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న బదిలీలు, ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు ప్రభుత్వానికి ఉపాధ్యాయులు కృతజ్ఞతలు చెప్తున్నారు.