పదో తరగతి పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పదో తరగతి పరీక్షలను 6 పేపర్లతోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు విద్యాశాఖ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 11 పేపర్లతో పదోతరగతి పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. హిందీ మినహా మిగతా సబ్జెక్టులకు రెండు పేపర్లు చొప్పున పరీక్షలు ఉంటున్నాయి. అయితే గత రెండేళ్లుగా కరోనా వైరస్ కారణంగా ఆరు పేపర్ల విధానాన్ని అమలు చేశారు.
అలాగే పరీక్షా సమయం 3 గంటలు కేటాయించగా.. సైన్స్ పేపర్ కు మాత్రం 3 గంటల 20 నిమిషాల సమయం కేటాయించారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఏప్రిల్ 3 నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. 2022-23 నుంచి పదోతరగతి పరీక్షల్లో సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. సైన్స్‌పేపర్ లో ఫిజిక్స్, బయాలజీ రెండింటికి సగం-సగం మార్కులు కేటాయించింది. ఈ మేరకు పరీక్షల విధానంలో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
టెన్త్ ఎగ్జామ్స్ సన్నద్ధతపై మంత్రి కార్యాలయంలో సమీక్షించారు. వంద శాతం సిలబస్ తో పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షల్లో వ్యాసరూప ప్రశ్నలకు మాత్రమే ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుందని, సూక్ష్మ రూప ప్రశ్నలకు ఛాయిస్ లేదని వెల్లడించారు. ఇందుకు సంబంధించి నమూనా ప్రశ్నా పత్రాలను వెంటనే విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలని, వీటికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని అధికారులకు సూచించారు. సెలవు దినాల్లో కూడా ప్రత్యేక తరగతులను నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకులు శ్రీ దేవసేన, ప్రభుత్వ పరీక్షల సంచాలకులు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.