కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇందులో భాగంగా మాస్టర్ ప్లాన్ పై నిర్ణయాన్ని హోల్డ్ లో పెట్టినట్టు తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే న్యాయస్థానానికి తెలపకుండా మాస్టర్ ప్లాన్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 17వ తేదీకి వాయిదా వేసింది.
కాగా కామారెడ్డి అభివృద్ధి కోసమంటూ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపొందించి అమలు చేయాలని చూసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ భూములు ఉన్నా.. మాస్టర్ ప్లాన్ కోసం ప్రైవేటు భూములను తీసుకోవడానికి రైతులు తీవ్రంగా వ్యతికేరించారు. తమ భూములను ఇచ్చేది లేదని ఉద్యమించారు. ఈ క్రమంలోనే ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడంతో.. ఉద్యమం మరింత తీవ్రమైంది. దీంతో కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ మాస్టర్ ప్లాన్ ను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది.
కానీ ప్రభుత్వం తరపున మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే అప్పటికే మాస్టర్ ప్లాన్ పై కొందరు రైతులు, ప్రైవేటు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నింటినీ కలిపి కోర్టు విచారణకు స్వీకరించింది. ప్రభుత్వాన్ని వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.
ఈ క్రమంలో మాస్టర్ ప్లాన్ ను హోల్డ్ లో పెట్టినట్లు ప్రభుత్వం సోమవారం కోర్టు తెలిపింది. అయితే న్యాయస్థానం దృష్టికి తీసుకురాకుండా మాస్టర్ ప్లాన్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 17వ తేదీకి వాయిదా వేసింది.