– మరోసారి తెరపైకి మ్యారేజ్ గేట్ వ్యవహారం
– ఢిల్లీ హైకోర్టులో విచారణ
– దర్యాప్తు చేపట్టామన్న ప్రభుత్వం
– నిజంగా.. నిజాయితీగా దర్యాప్తు జరుగుతుందా?
– మేఘా అక్రమాలపై చర్యలకు సర్కార్ పూనుకుంటుందా?
తెలంగాణలో కాంట్రాక్ట్ సంస్థలు, అధికారులు క్విడ్ ప్రో కోగా పని చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మ్యారేజ్ గేట్ వ్యవహారం ఆ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూర్చింది. ప్రస్తుతం ఈ పంచాయితీ ఢిల్లీ హైకోర్టు దగ్గర ఉంది. దీనిపై అసలు నిజాలు బయటకు రావాలని నారాయణపేట జిల్లా బాపనకుంటకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ(డీవోపీటీ)కి ముందు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును రాష్ట్ర ప్రభుత్వానికి పంపడంపై ఆయన అభ్యంతరం తెలుపుతూ కొన్నాళ్ల క్రితం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబరు 12న విచారణ చేపట్టిన న్యాయస్థానం.. డీవోపీటీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అది రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. తాజాగా జస్టిస్ యశ్వంత్ వర్మ ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్(ఏఎస్‌జీ) మాధవి దివాన్ హాజరయ్యారు. ఇప్పటికే ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ ప్రారంభించిందని తెలిపారు. ఆరు వారాల్లో విచారణ నివేదికను న్యాయస్థానానికి సమర్పిస్తామని చెప్పారు. ఈ దశలో జోక్యం చేసుకున్న జస్టిస్ యశ్వంత్ వర్మ.. ఐఏఎస్ అధికారులపై కేంద్ర ప్రభుత్వమే విచారణ చేపట్టాలని నిబంధన ఏమైనా ఉందా అని పిటిషనర్ న్యాయవాది మోహిత్ జాఖడ్ ను ప్రశ్నించారు. ఆయన స్పందిస్తూ అధికారుల ప్రాసిక్యూషన్ కు అనుమతించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి కేసును డిసెంబరు 23వ తేదీకి వాయిదా వేశారు.
హైదరాబాద్ లోని స్టార్ హోటళ్లలో ఐదు రోజులపాటు అంగరంగవైభవంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ కుమార్తె వివాహ వేడుక జరిగింది. గతేడాది డిసెంబర్ 17 నుంచి 21 మధ్య పలు ఈవెంట్లు, డిన్నర్లు, హోటల్ రూముల ఏర్పాట్లు ఇలా చాలా గ్రాండ్ గా నిర్వహించారు. దీని ఖర్చంతా కాళేశ్వరం కాంట్రాక్ట్ సంస్థ మేఘా కంపెనీనే చూసుకుందని.. ఈవెంట్లను బుక్ చేసినట్లు ఈ మెయిల్, ఇన్ వాయిస్ డేటాను ఓ ఇంట్లీష్ వెబ్ సైట్ ఆధారాలతో సహా ప్రచురించింది. ఆ తర్వాత ఇక్కడి మీడియాలోనూ ఇది హైలెట్ అయింది. తొలివెలుగు కూడా పలు ఆధారాలను సేకరించి కథనాలు ఇచ్చింది. తాజ్ హోటల్ గ్రూప్ నకు బిగ్ వేవ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బిల్లులు చెల్లించగా.. అది బోగస్ కంపెనీ అని తేలింది. మేఘాకు చెందిన వివిధ సంస్థల డైరెక్టర్లే ఇందులో ఉన్నారని, అందుకే ఈ పెండ్లి ఏర్పాట్లు, బిల్లులతో మేఘా కంపెనీకి సంబంధం ఉందని బయటపడింది. పెండ్లికి ఐదు నెలల ముందే హోటళ్లలో రూమ్స్ ను బుక్ చేశారని, అంతకు ఒక్క నెల ముందు బిగ్ వేవ్ ఇన్ ఫ్రా కంపెనీని ఏర్పాటు చేశారని కథనాలు వచ్చాయి.
ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఇదే క్రమంలో మేఘా బరితెగించింది. ఓవైపు ఐఏఎస్ లను వాడుకుంటూనే ఇంకోవైపు మీడియాను బ్లాక్ మెయిల్ చేయాలని చూసింది. వందల కోట్లు కట్టాలని పలు సంస్థలకు లీగల్ నోటీసులు పంపించింది. అది కూడా ఎక్కడో ఖమ్మం కోర్టు నుంచి ఇచ్చింది. అయితే.. హైకోర్టు దీన్ని రద్దు చేసింది. కోర్టులు ఎన్ని చెప్పినా నోటీసులు పంపుతూ మీడియాను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంది మేఘా. గత నెలలో కూడా 17 మీడియా సంస్థలు వంద కోట్ల చొప్పున వారం రోజుల్లో కట్టాలని నోటీసులు పంపింది. చేస్తున్న అవినీతిని బట్టబయలు చేస్తుండడంతో కొన్ని మీడియా సంస్థలను టార్గెట్ చేసుకుని ఇష్టారాజ్యంగా చేస్తోంది. తనపై వస్తున్న వార్తలను జీర్ణించుకోలేక.. మేఘా ఇష్టానుసారంగా లీగల్ నోటీసులతో బెదిరింపులకు పాల్పడుతోందని జర్నలిస్టు వర్గాలు మండిపడ్డాయి. ఒకవేళ ఈ వ్యవహారంలో మేఘా పాత్ర లేకుంటే ఎందుకు ఉలిక్కిపడుతున్నారని.. పురువు నష్టం పేరుతో 17 వందల కోట్లు కట్టాలని నోటీసులు పంపడం ఏంటి..? ఇప్పటిదాకా దోచుకున్నది సరిపోలేదా? అని నిలదీశాయి.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ నిర్వహిస్తున్న మేఘా సంస్థ వేల కోట్ల అవినీతికి పాల్పడిందని ప్రతిపక్షాలు నిత్యం గగ్గోలు పెడుతూనే ఉంటాయి. తొలివెలుగు కూడా పక్కా ఆధారాలతో కథనాలు ఇచ్చింది. అధికారులను మ్యానేజ్ చేయడం, ఫారెన్ టూర్లతో పార్టీలు ఇచ్చి అన్నీ కానిచ్చేయడంలో మేఘా కృష్ణారెడ్డిని మించినవారు లేరనే వాదన ఉంది. పైగా ఏదైనా విషయం బయటపడితే దాన్ని మ్యానేజ్ చేయడం.. జనాల్లో నానకుండా డైవర్ట్ చేయడం.. వెన్నతో పెట్టిన విద్య అని చెబుతుంటారు. అలా.. తెలంగాణ ఇరిగేషన్ శాఖ కీలక అధికారి రజత్ కుమార్ కుమార్తె పెళ్లి బిల్లులు కూడా ఈ సంస్థే కట్టిందని ఆరోపణలు ఉన్నాయి. వీటిపై నిజానిజాలు తేల్చాలని గవినోళ్ల శ్రీనివాస్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈక్రమంలోనే ఈ చెల్లింపులపై దర్యాప్తు చేపట్టామని రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది.