ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ తీసుకునే నిర్ణయం కోసం గవర్నర్ వెయిట్ చేస్తున్నారా…? కేసీఆర్ పట్టించుకోక పోతే, తానే రంగంలోకి దిగేందుకు గవర్నర్ రెఢీయా…? ఇప్పటికే న్యాయ సలహాలు కూడా పూర్తవుతున్నాయా…? అంటే అవుననే అంటున్నాయి రాజ్ భవన్ వర్గాలు. ఇటు ప్రజల్లో నుండి వస్తున్న విజ్ఙప్తులు కూడా గవర్నర్ జోక్యానికి కారణమయ్యేలా కనపడుతున్నాయి.
18రోజుల నుండి ఆర్టీసీ సమ్మెతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు 50వేల కుటుంబాలు జీతం లేకుండా గడుపుతున్నారు. మరో 8 రోజులు గడిస్తే… వారికి జీతం అందక రెండు నెలలు అవుతుంది. ఇలాంటి సమయంలో కూడా గవర్నర్ జోక్యం చేసుకోకపోతే ఎలా…? ప్రభుత్వ పెద్దగా తను నిర్ణయం తీసుకుంటారు అని చాలా మంది ధీమాగా ఉన్నా… ఇంతవరకు ఎలాంటి నిర్ణయం అయితే జరగలేదు. కానీ ఆర్టీసీ యూనియన్ నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ అంశంపై టైం అడిగిన వెంటనే ఆమె స్పందిస్తూ… ప్రతి ఒక్కరినీ కలుస్తున్నారు.
అయితే, ఆర్టీసీ సమ్మె విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవచ్చంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారం గవర్నర్ కల్పించుకునే హక్కు ఉందని, ముఖ్యంగా హైదరాబాద్ వరకు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, అంతర్గత భద్రత విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని పున సమీక్షించే అధికారం పార్లమెంట్ కట్టబెట్టిందని, ఓసారి మంత్రి వర్గ అభిప్రాయం తీసుకొని… ఆ తర్వాత గవర్నర్ తుది నిర్ణయం తీసుకోవటంలో ఎలాంటి రాజ్యంగ ఉల్లంఘన ఉండదని స్పష్టం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ఆర్టికల్ 8 ప్రకారం గవర్నర్‌కు సర్వాధికారాలున్నాయని స్పష్టం చేస్తున్నారు. చదవుకున్న యువత కూడా… ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నందున, భద్రత పేరుతో… ఇబ్బందులకు గురిచేస్తున్నందున… గవర్నర్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.
అయితే, ప్రభుత్వ నిర్ణయంపై ఇంకాస్త వేచి చూసే ధోరణిలో గవర్నర్ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా న్యాయ సలహా తీసుకోవటమే కాకుండా, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సూచనలు, సలహాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అందువల్ల… ఈ సమ్మె ప్రభావం, సమ్మె సంక్షోభం మరింత ముదిరితే… ఖచ్చితంగా గవర్నర్ జోక్యం చేసుకుంటారని బీజేపీ నేతలూ ధీమాగా ఉన్నారు.