సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఎల్లమ్మ జాతర ఉత్సవాల్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆమె ఈ సందర్భంగా అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ క్రమంలోనే హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
120 ఏళ్ల చరిత్ర కలిగన రేణుక ఎల్లమ్మను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నా అని ఆమె తెలిపారు. ఈ ఉత్సవాల్లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా పాల్గొన్నారు.
అసురశక్తులపై, దైవ శక్తులు విజయం సాధిస్తే మంచి జరుగుతుంది. ఆధ్యాత్మికతకు వేదిక మన దేశం. కొవిడ్ లాంటివి కూడా మన దేశానికి ఎక్కువ రాలేదు అంటే అది మన దగ్గర ఉన్న నైతిక విలువలు, మన శక్తి వల్లే అని ఆయన పేర్కొన్నారు.
దేశాన్ని విశ్వగురు చేయాలంటే 130 కోట్ల మందిని ఏకం చేయాల్సిన అవసరం ఉందన్నారు బండారు దత్తాత్రేయ. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్, బీజేపీ కార్పొరేటర్లు, స్థానిక బీజేపీ నేతలు పాల్గొన్నారు.