తెలంగాణలో మళ్ళీ ప్రజాదర్బార్ ప్రారంభం కాబోతోంది. ఐతే, అది ముఖ్యమంత్రి అధికార నివాసం ప్రగతిభవన్‌లో కాదు, రాజ్‌భవన్‌లో..! సీఎం నిర్వహించాల్సిన ప్రజాదర్బార్ గవర్నర్ ఎందుకు నిర్వహించాలని అనుకుంటున్నారు..?
Advertisements
హైదరాబాద్: రాష్ట్రంలో రెండో అధికారిక కేంద్రం ఏర్పడనుందా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాజ్‌భవన్ నుంచి గవర్నర్ నేరుగా ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించాలని భావిస్తున్నట్టు సమాచారం. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ప్రవేశ పెట్టిన వినూత్న కార్యక్రమం. ప్రజలు నేరుగా సీఎంకు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించడం దీని ఉద్దేశం. ప్రతి రోజు ఉదయం ఒక గంటసేపు క్యాంపు ఆఫీసులో ప్రజలను సీఎం కలిసేవారు. అది ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉండేది. ఆఫీసుల చుట్టూ తిరిగినా అవ్వని పనులు ప్రజాదర్బార్‌లో అయిపోయేవి. రాజశేఖర్‌రెడ్డి తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. తెలంగాణ వచ్చిన తరువాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాదర్బార్‌ను రద్దు చేశారు. క్యాంప్ ఆఫీస్ చుట్టూ కంచె వేసి సామాన్యుడి సంగతి దేవుడెరుగు చిన్న చిన్న ప్రజా ప్రతినిధులు కూడా దరిదాపుల్లోకి వెళ్లలేని పరిస్థితి.
దీన్నే బీజేపీ ఇప్పుడు ఒక ఆయుధంగా మార్చుకోనుంది. నేరుగా రంగంలోకి దిగకుండా గవర్నర్ ద్వారా కేసీఆర్‌కు చెక్ పెట్టించాలని భావిస్తోంది. ఎంబీటీ నేత అహ్మదుల్లాఖాన్ గవర్నర్‌ను కలిసి సీఎం కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని కంప్లయింట్ చేశారు. కేసీఆర్ సచివాలయం మొహం కూడా చూడడం లేదని చెప్పారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవాలంటే సరైన వేదిక లేనందున గవర్నర్ జోక్యం చేసుకుని రాజ్‌భవన్‌లోనే ప్రజాదర్బార్ నిర్వహించాలని కోరారు. దానికి గవర్నర్ కూడా సానుకూలంగా స్పందించారు. గత రెండు రోజులుగా ప్రజాదర్బార్‌పై గవర్నర్ సీరియస్‌గా ఆలోచిస్తున్నారని సమాచారం. ప్రజాదర్బార్ నిర్వహించి గవర్నర్ నేరుగా ప్రజాసమస్యలు తెలుసుకోవడం స్టార్ట్ చేస్తే కేసీఆర్ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి.
తనకున్న విశేష అధికారాలను ఉపయోగించి గవర్నర్ అధికారులను రాజ్‌భవన్‌కు పిలిపించుకుని ప్రజాదర్బార్‌లో వచ్చిన సమస్యలను పరిష్కరించమని ఆదేశిస్తే రాష్ట్రంలో రెండు అధికార కేంద్రాలు తయారయ్యే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్న అసంతృప్తి ప్రజల్లో ఉంది. ఈ సమయంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తే ప్రజలనుంచి విశేష స్పందన వస్తుంది. నేరుగా గవర్నర్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకునే అవకాశం వస్తే ప్రజల్లో ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. తెలంగాణలో పాగా వేయాలని అనుకుంటున్న ఢిల్లీ పెద్దలకు రాష్ట్రంలో మరో అధికార కేంద్రాన్ని ఏర్పాటుచేసి కేసీఆర్‌ను రాజకీయంగా దెబ్బకొట్టే అవకాశం ఉంది. గవర్నర్ ప్రజాసమస్యలు తెలుసుకున్నప్పటికీ వాటి పరిష్కారానికి మళ్ళీ ప్రభుత్వం దగ్గరకే వెళ్ళాలనే వాదన కూడా వినిపిస్తోంది. గవర్నర్ ప్రజాదర్బార్ వల్ల ప్రజలకు న్యాయం జరుగుతోందా లేక టిఆర్ఎస్-బీజేపీ మధ్య రాజకీయ క్రీడకు వేదిక అవుతుందో వేచి చూడాలి.