వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్ పై గవర్నర్ తమిళసై సౌందర రాజన్ రియాక్ట్ అయ్యారు. రాజకీయాలు, సిద్ధాంతాలకు అతీతంగా మహిళలను గౌరవించాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళసై గుర్తు చేశారు. వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసిన తీరుపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. షర్మిల భద్రత, ఆరోగ్య పరిస్థితిపై గవర్నర్ ఆరా తీశారు. షర్మిల లోపల ఉండగా, కారును లాక్కుంటూ తీసుకెళ్లిన దృశ్యాలు కలవరపెట్టినట్లు గవర్నర్ తమిళసై తెలిపారు. రాజకీయ నేపథ్యం, భావజాలం ఏదైనా కావచ్చు.. మహిళా నాయకులు, మహిళా కార్యకర్తల పట్ల గౌరవంగా వ్యవహరించాల్సిన అవసరముందని మండిపడ్డారు గవర్నర్ తమిళసై .
కాగా సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో వైఎస్ షర్మిల ప్రజాప్రస్థాన యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేపై పెద్ది సుదర్శన రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన టీఆర్ఎస్ లీడర్లు.. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలపై దాడికి దిగారు. షర్మిల గో బ్యాక్ అంటూ ఆమెకు నినాదాలు చేశారు. షర్మిల ప్రచార రథం, ఫ్లెక్సీలకు నిప్పు పెట్టారు. దీంతో తనపై టీఆర్ఎస్ శ్రేణులు చేసిన చేసిన దాడిని నిరసిస్తూ.. షర్మిల మంగళవారం ప్రగతిభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. అయితే పోలీసులు ఆమెను అడ్డగించే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలోనే షర్మిల కారులోంచి దిగకపోవడంతో.. టోయింగ్ వెహికల్ తీసుకువచ్చి కారును ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ కు లాక్కెళ్లారు. పోలీసులను అడ్డుకునేందుకు వైఎస్సార్టీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. కానీ వారిని పోలీసులు చెదరగొట్టారు. స్టేషన్‌లో బలవంతంగా కారు డోర్లు ఓపెన్ చేసి.. షర్మిల, ఆమె అనుచరులను అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మంగళవారం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా.. జడ్జి బెయిల్ మంజూరు చేశారు.
ఈ అరెస్ట్ పై వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. వైఎస్సార్టీపీకి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే తమపై దాడులు చేస్తూ అక్రమ అరెస్ట్ లు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని.. ఆయన ఇచ్చిన హామీలను ఎండగడుతూ ప్రజల పక్షాన నిలబడం తప్పా అని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం తాలిబన్ల దేశమా అంటూ షర్మిల నిలదీశారు.
ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చే అవకాశం ఉండటం వల్లే షర్మిలను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ముందస్తుగా సహకరించాలి అని కోరినా వినకపోవటం వల్ల.. రోడ్డుపై షర్మిల, పార్టీ కార్యకర్తలతో న్యూసెన్స్ క్రియేటయ్యిందన్నారు. ఈ సమయంలో రిమాండ్ విధించకపోతే లా అండ్ అడర్ సమస్య వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.