తెలంగాణ కుంభమేళ మేడారం జాతర ముగిసింది. ఈసారి కోటిన్నర మంది భక్తులు వచ్చినట్లు ప్రకటించింది ప్రభుత్వం. అయితే.. జాతర ముగిసిన తరువాత కూడా లక్షలాది మంది సమ్మక్క, సారలమ్మల దర్శనానికి వస్తారని.. వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. మౌలిక వసతులు, సదుపాయాలు పెరగడంతో ఈసారి మేడారం జాతరకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉందన్నారు మంత్రులు ఎర్రబెల్లి, ఇంద్రకరణ్‌రెడ్డి. జాతరలో ఎక్కడా ట్రాఫిక్ జామ్ లు లేవని.. భక్తులు ఒక్క రాత్రి మాత్రమే ఉండి వెళ్లారని వివరించారు.
శనివారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. నిలువెత్తు బంగారం సమర్పించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. అయితే.. గవర్నర్ పర్యటనలో మంత్రులు, కలెక్టర్, ఎస్పీ ఇతర అధికారులెవరూ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తమిళి సైకి స్వాగతం పలికారు. అప్పటిదాకా జాతర దగ్గరే ఉన్న మంత్రులు, అధికారులు గవర్నర్ రాగానే కనిపించకపోవడంపై సీతక్క విస్మయం వ్యక్తం చేశారు.
గవర్నర్ వస్తున్న విషయం తెలిసినా కలెక్టర్, ఎస్పీలు ఎందుకు రాలేదని సీతక్క ప్రశ్నించారు. జాతరలో ఇలాంటి రాజకీయాలకు పాల్పడటం సరికాదని హితవు పలికారు. ఇటు గవర్నర్ రాక సందర్భంగా పోలీసులు భక్తుల దర్శనాన్ని నిలిపివేయడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాకతో ఇబ్బందులు పడ్డ వారికి క్షమాపణలు చెప్పారు. ఏక్ భారత్ శ్రేష్ట భారత్ స్ఫూర్తికి ఈ గొప్ప ఆదివాసీ జాతర ఆదర్శంగా నిలుస్తుందన్నారు గవర్నర్.
కరోనా కారణంగా ఈ ఏడాది జాతర ఉంటుందో లేదో అన్న అనుమానంతో మూడు నెలల ముందు నుంచే భక్తులు మేడారంలో వనదేవతలను దర్శించుకునేందుకు రాకపోకలు సాగించారు. ఈనెల 16న జాతర ప్రారంభమయ్యే నాటికి 60 లక్షల మంది భక్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నాలుగు రోజుల్లో 75 లక్షల మంది భక్తులు తరలివచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ జాతర కోసం ప్రభుత్వం రూ.75 కోట్లు ప్రకటించగా.. దేవాదాయశాఖ మరో రూ.10 కోట్లు మంజూరు చేసింది.