మహిళలు ఆదర్శవంతమైన భావంతో జీవించినప్పుడే ఉన్నత లక్ష్యాలను చేరుకోగలరని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మహిళలు రాజకీయాల్లో రాణించడం కష్టంగా మారిన ఈరోజుల్లో బీజీపీ తనకు మంచి అవకాశం కల్పించదన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సత్యసాయిబాబా 94వ జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవాల కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడిన గవర్నర్…సత్యసాయిబాబాకు తాను ఎప్పటి నుంచో భక్తురాలినని చెప్పారు. ప్రతి రోజు సత్యసాయిబాబా గుడికి వెళ్లనిదే రోజు గడిచేది కాదన్నారు. సత్యసాయిబాబా చేపట్టిన సేవా కార్యక్రమాలు వెలకట్టలేనివని..ఆయన ఆధ్యాత్మిక బోధనలు ఎంతో మందికి స్ఫూర్తి నిచ్చాయని తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఏ ఆస్పత్రిలోనైనా అన్ని విభాగాలతో పాటు బిల్లు కట్టే విభాగం కూడా ఉంటుందని..కానీ సత్యసాయి ఆసుపత్రుల్లో మాత్రం ఆ విభాగం కనిపంచలేదని గవర్నర్ ప్రశంసించారు.