కరోనా మహమ్మారి చికిత్స చేయటంలో తెలంగాణలో ప్రైవేటు ఆసుపత్రుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి ఆపద సమయంలోనూ ప్రైవేటు ఆసుపత్రులు భారీగా బిల్లులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం కరోనా చికిత్సకు ఎంత తీసుకోవాలో స్పష్టంగా చెప్పినప్పటికీ, ప్రైవేటు ఆసుపత్రులు మాత్రం డోంట్ కేర్ అంటున్నాయి.
ప్రైవేటు ఆసుపత్రుల ఆగడాలను అరికట్టాలంటూ ప్రభుత్వానికి వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. కోర్టులు సైతం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దశలో… ప్రతిపక్షాలు అసెంబ్లీలో సీనీయర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
సీనీయర్ అధికారులతో కమిటీ వేసి, ప్రైవేటు ఆసుపత్రులపై ఫిర్యాదులు అందగానే చర్యలు తీసుకోవాలని వచ్చిన డిమాండ్ల నేపథ్యంలో… ప్రభుత్వం ముగ్గురు అధికారులతో కమిటీ వేసింది. సీనీయర్ ఐఎఎస్ అధికారి రాహుల్ బొజ్జా ఆద్వర్యంలో కమిటీ పనిచేస్తుండగా… కమిటీలో ఐఎఎస్ లు సర్ఫరాజ్ అహ్మద్, దివ్యలున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కమిటీ ఆయా ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే వైద్యం అందుతుందా లేదా, కోవిడ్-19 మార్గదర్శకాలను ఆసుపత్రులు పాటిస్తున్నాయా లేదా అన్న అంశాలను పరిశీలించాలని సూచించింది. ఎవైనా ఫిర్యాదులు వస్తే విచారణ చేయాలని… వాటిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.