తెలంగాణ సమాజం నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండటంతో ఎల్.ఆర్.ఎస్ పై సర్కార్ వెనక్కి తగ్గింది. కొంతకాలంగా జనం, రియల్టర్స్ ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఎల్.ఆర్.ఎస్ లేకున్నా రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అయితే, కొత్తగా చేసిన ప్లాట్లకు మాత్రం ఎల్.ఆర్.ఎస్ ఖచ్చితంగా ఉండాల్సిందేనన్న నిబంధనను విధించింది.
ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో పాత లేఔట్లలోని భూముల రిజిస్ట్రేషన్ కు లైన్ క్లియర్ అయ్యింది. అయితే, కొత్తగా చేసిన ఓపెన్ ప్లాట్లు లేదా నిర్మాణాలు ఉంటే వాటిని మాత్రం రిజిస్ట్రేషన్లు చేయమని ఉత్తర్వుల్లో పేర్కొంది. కొత్తగా నిర్మాణాలు అంటే… బిల్డర్స్ లేదా డెవలపర్స్ నుండి మొదటిసారి కొనుగోలు చేస్తున్న వాటిని కొత్త వాటిగా సర్కార్ పేర్కొంది. మరోవైపు ఎల్.ఆర్.ఎస్ లేకుండా రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పినప్పటికీ, ఎల్.ఆర్.ఎస్ పూర్తిగా రద్దు చేసినట్లు మాత్రం ప్రకటించలేదు. అంటే చార్జీలను భవిష్యత్ లో అయినా చెల్లించాల్సినట్లుగానే పరిగణించాల్సి ఉంది.