తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం అప్పుల పాలయ్యిందని, సీఎం కేసీఆర్ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, ప్రతి మనిషిపై 3లక్షల అప్పు చేసి పెట్టిండు అంటూ ప్రతిపక్షాల విమర్శలు తెలిసినవే. అభివృద్ధి కోసం అప్పులు చేయక తప్పదంటూ ఒకటి రెండు సందర్భాల్లో సీఎం కేసీఆర్ సైతం ఎదురుదాడి చేశారు.
గత మూడు నెలలుగా ఆర్థిక రంగం మీద కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో ప్రభుత్వం ప్రభుత్వాన్ని నడిపేందుకు అప్పులనే నమ్ముకున్నట్లు తెలుస్తోంది. గత మూడు నెలలుగా ప్రభుత్వం దాదాపు 12,461కోట్ల అప్పు చేసింది. ఏప్రిల్, మే నెలల్లో నెలకు 4వేల కోట్లు, జూన్ నెలలో 4,461కోట్ల అప్పు చేసింది. ఇలాగే ప్రభుత్వం ప్రతి నెల అప్పులు చేసుకుంటూ పోతే ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ సర్కార్ చేసిన అప్పులు 49,884కోట్లకు చేరుతుంది. అంటే దాదాపు 50వేల కోట్లు అన్నమాట.
ఈ అప్పు గత రెండు సంవత్సరాల కన్నా ఎంతో ఎక్కువ. 2018-19లో ప్రభుత్వం 26,740 కోట్లు అప్పు చేయగా, 2019-20 ఆర్థిక సంవత్సరంలో 37,109కోట్ల అప్పు చేసింది. అంటే గత ఈ ఏడాది అప్పు ప్రభుత్వానికి పెను భారం కాక తప్పేలా లేదని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.