అవినీతిమయమైన తెలంగాణ రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాలనుకుంటున్న ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తెచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం జరిగే కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కొత్త తెలంగాణ రెవెన్యూ చట్టానికి ఆమోదం తెలపనున్నట్టు సమాచారం. ఈ చట్టంలో ముఖ్యంగా గ్రామ స్థాయిలో అవినీతికి కేంద్ర బింధువైన వీఆర్వో వ్యవస్థను పూర్తిగా రద్దు చేయనున్నట్టు తెలిసింది.
గ్రామస్థాయిలో ప్రభుత్వ ప్రతినిధిగా వీఆర్వోలు వ్యవహరిస్తారు. ఏ శాఖ పనిలోనైనా వీఆర్వోలే కీలక పాత్ర పోషిస్తారు. అదే సమయంలో రెవెన్యూ రికార్డుల సంరక్షకుడిగా పనిచేస్తారు. అయితే, భూముల విలువలు పెరగడం.. దానికి తగ్గట్లుగానే వివాదాలు కూడా పెరగడం వీఆర్వోలకు వరంగా మారింది. రికార్డుల తారుమారు.. ఒకరికి బదులు మరొకరి పేరు, విస్తీర్ణం నమోదులోనూ అడ్డగోలుగా వ్యవహరించడంతో భూ వివాదాలు మరింత పెరిగాయి. దీనికితోడు వీఆర్వోలుగా పదోన్నతులు పొందిన మరికొందరు.. చట్టంపై అవగాహన లేక తప్పుల తడకగా రికార్డులు నమోదు చేయడం కూడా భూ వివాదాలకు దారితీసింది. ఈ పరిణామాలతో రెవెన్యూ వ్యవస్థపై ప్రజల్లో ఒకరకమైన హేయభావం ఏర్పడింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం జరిగిన పరిణామాలు కూడా శాఖ పనితీరుపై ప్రభావం చూపాయి. సాంకేతిక సమస్యలు, మార్పు చేర్పులకు ఆప్షన్ ఇవ్వకపోవడం, రికార్డులను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు తీవ్ర జాప్యం కారణంగా పరిస్థితి మరింత తీవ్రమైంది.భూ రికార్డుల ప్రక్షాళన లక్ష్యం కాస్తా పక్కదారి పట్టింది. ఈ పరిణామాలన్నింటిపై ఇంటెలిజెన్స్ విభాగంతో వివరాలు తెప్పించుకున్న సీఎం.. రెవెన్యూశాఖలో అవినీతి పెరిగిపోయిందని ఇక కఠినంగా వ్యవహరించాల్సిందేననే నిర్ణయించారు.
రెవెన్యూ శాఖలో పనిచేస్తోన్న కిందిస్థాయి ఉద్యో గుల్లో అవినీతి పెరిగిపోయిందని, వీరిని సంస్క రించకపోతే రెవెన్యూ వ్యవస్థకే ప్రమాదమని సీఎం కేసీఆర్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. సీఎం, సీఎస్, భూ పరి పాలన ప్రధాన కమిషనర్‌కు లేని అధికారాలు వీఆర్‌ఓల కున్నాయని గతంలో సీఎం శాసనసభ లోనే చెప్పారు. గత ఏడాది ఓ ఆదిలాబాద్ రైతుతో ఫోన్ లో మాట్లాడిన ముఖ్యమంత్రి… స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రెవెన్యూ పని పడదామని కూడా అన్నారు. కొత్త రెవెన్యూ చట్టంపై కసరత్తుకు అప్పుడే అధికారులను ఆదేశించారు. కొందరు న్యాయ నిపుణులు సలహాలు కూడా తీసుకున్నారు. టైటిల్ గ్యారంటీ చట్టం తీసుకురావాలని కూడా కొందరు నిపుణులు ముఖ్యమంత్రికి సూచించారు. ఈ నేపథ్యంలోనే వీఆర్వో వ్యవస్థను రద్దుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయితే వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తే వారిని పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖలో నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆదివారం కేబినెట్ సమావేశం అనంతరం వీఆర్వో వ్యవస్థ రద్దు…కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించిన పూర్తి సమాచారం బయటకు రానుంది.