నియోజకవర్గాలకు కేటాయించే నిధులపై కోత విధించడంపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగంగానే తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా నిధులపై కోత పెట్టాక నియోజకవర్గాల్లో తిరగలేమని తేల్చి చెబుతున్నారు. జనం కొట్టినా కొడతారని అంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులపై కోత విధిస్తే ఇహ ఊళ్లకు వెళ్లక్కర్లేదనేది ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ రగిలిపోయే ఒక బిగ్ డిస్కషన్.
హైదరాబాద్: సీడీసీ.. అంటే నియోజకవర్గ అభివృద్ధి పనుల కింద కేవలం రూ.120 కోట్లు మాత్రమే కేటాయించడంపై శాసనసభ్యులలో అసంతృప్తి బాగా రగిలిపోతోంది. ఈ నిధులు పాత పనులకే సరిపోతాయిని, భవిష్యత్తులో ఇక నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేపట్టాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2019-2020 ఆర్థిక సంవత్సరానికి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందుబాటులో లేవనేది అందరికీ ఇక క్లారిటీ వచ్చేసింది. ఇలా ఇప్పుడు నియోజకవర్గ పర్యటనలకు పోతే ప్రజలు ఛీ కొడతారని అంటున్నారు. ప్రజలు ఎక్కడికక్కడ తమని అడ్డుకోవడమే కాకుండా తన్నినా ఆశ్చర్యపోనక్కరలేదని గొణుక్కుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఏ మొహం పెట్టుకొని జనంలోకి వెళ్లాలని ఎమ్మెల్యేలు పార్టీ ‘ఓనరు’నే నేరుగా ప్రశ్నిస్తున్నారు.
గత ఏడాది నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి రూ.3 కోట్ల చొప్పున మొత్తం రూ.480 కోట్లు నియోజకవర్గ అభివృద్ధి పనులకు కేటాయించారు. 2018 -19 ఆర్థిక సంవత్సరంలో రూ.362 కోట్లు కేటాయించి.. దానిని మళ్లీ సవరించి రూ.298 కోట్లు చేశారు. 2017-18లో నియోజకవర్గ అభివృద్ధి నిధులు రూ.299 కోట్లు ఖర్చయ్యాయి. ఇఫ్పుడు కేటాయించిన నిధులు చూస్తుంటే కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపాదనలు పంపేందుకు అవకాశం లేదని శాసనసభ్యులు అభిప్రాయ పడుతున్నారు.
ఒకవైపు పార్టీలో ఆశించిన స్థాయిలో పదువుల దక్కక అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలకు పుండు మీద కార్ చల్లినట్లు సీడీసీ నిధుల కోత తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. దీనిపై సీఎంను కలిసి తమ అసంతృప్తిని తెలిపి, నియోజకవర్గాలలో పరిస్థితిని వివరించాలని శాసనసభ్యులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీలో నిరసన గళాలు వినిపిస్తున్న నాయకులకు ఎమ్మెల్యేలు కూడా తోడైతే అధినాయకత్వానికి మరింత తలనొప్పి తప్పదు.