ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వేరుపడి ఎనిమిది సంవత్సరాలైంది. అయినా ఎప్పడు ఏదో విషయంలో వివాదం రేగుతోంది. ముఖ్యంగా ప్రాజెక్టుల నిర్మాణం, నీటి విషయంలోనూ ఒక రాష్ట్రంపై మరో రాష్ట్రం ఫిర్యాదు చేసుకుంటోంది.
తాజాగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీపై తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కృష్ణాబోర్డు చైర్మన్ కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ రెండు లేఖలు రాశారు.
ప్రకాశం బ్యారేజీకి దిగువన రెండు ఆనకట్టల నిర్మాణానికి ఏపీ చేసిన ప్రతిపాదనలపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టులను చేపట్టరాదని లేఖలో పేర్కొంది. ఈ మేరకు నూతన బ్యారేజీల నిర్మాణ పనులు చేపట్టకుండా ఆంధ్రప్రదేశ్ ను నిరోధించాలని తెలంగాణ కోరింది.
కృష్ణా జలాలపై ఆధారపడిన పంప్డ్ స్టోరేజీ పథకాల ప్రతిపాదనలపై తెలంగాణ మరో లేఖ రాసింది. జలవిధానం మేరకే తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ లేఖలో కోరింది.
తాగునీటి అవసరాలను పక్కన పెట్టి ఇతరాల కోసం నీటి తరలింపు సరికాదని పేర్కొంది. పంప్డ్ స్టోరేజీ స్కీమ్, విద్యుత్ ఉత్పత్తికి జలాల తరలింపు సరికాదని అభ్యంతరం వ్యక్తం చేసింది. అనుమతి లేని పంప్డ్ స్టోరేజ్ స్కీమ్‌లపై పరిశీలనలు చేయాలని కోరింది. సీడబ్ల్యూసీ, బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేని వాటిపై పరిశీలనలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం విన్నవించింది.