సంక్రాంతి సెలవులను తెలంగాణ ప్రభుత్వం కుదించింది. అయిదు రోజుల సెలవులను నాలుగు రోజులకే కుదిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో ఈ నెల 11నుంచి 16వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని మొదట ప్రకటించారు. పాఠశాల యాజమాన్యాలు ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించాయి. 17నుంచి పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో సంక్రాంతి సెలవులను కుదించారు. జనవరి12నుంచి 16 వరకు పండగ సెలవులు ఉంటాయని పేర్కొన్నారు.
రెండో శనివారం జనవరి 11 నుండే సెలవులు మొదలవుతాయని చెప్పినా… ఆర్టీసీ సమ్మె కారణంగా గతంలో ఎక్కువ సెలవులు ఇచ్చినందున ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు రెండో శనివారం సెలవును రద్దు చేస్తూ గతంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాఠశాల విద్యాశాఖ తాజాగా తన ఉత్తర్వులను సవరించింది. అయితే ముందుగా సెలవులు ఉంటాయని చెప్పి, ఇప్పుడు ఆకస్మాత్తుగా సెలవులను కుదించటం సరైంది కాదని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.