తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి. మార్చి నెలలో విద్యార్థులకు నిర్వహించాల్సిన పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం నుంచి జరగాల్సిన టెన్త్ పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. పదవ తరగతి పరీక్షలు ప్రారంభమైన రెండు, మూడు రోజుల్లోనే తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం పెరగడంతో…రాష్ట్రంలో జరగాల్సిన పరీక్షలన్నింటిని వాయిదా వేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మార్చి 23నుంచి 30వరకు తెలంగాణలో జరగాల్సిన పరీక్షలను రీ షెడ్యుల్ చేయాలని హైకోర్టు ఆదేశించడంతో…అన్ని పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. తదనంతరం పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించింది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ అమలను ఏప్రిల్ 14వరకు పొడిగించిన నేపథ్యంలో ఎస్సేస్సీ పరీక్షలను మరోసారి వాయిదా వేసింది ప్రభుత్వం. పదవ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నామని ఎస్సేస్సీ బోర్డు డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 14 తరువాత రాష్ట్రంలోని పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.