ఇన్నాళ్లు ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రతి నెలా టైంకు జీతం, హాయిగా పని ఉంటుంది, ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జీతం పెంచటం నిశ్చింతంగా ఉండొచ్చు అనే ఫీలింగ్ ఉండేది. కానీ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే జీతాలు పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. పీఆర్సీ కమీషన్ వేసి ఏడాది గడుస్తున్నా… జీతాల పెంపుపై నిర్ణయం రాలేదు. ఎన్నికల సమయంలో హాడావిడి చేయటం, ఆ తర్వాత సైలెంట్ అయిపోవటం కామన్ అయిపోయింది.
పెంచిన జీతాల సంగతి దేవుడెరుగు… ఉన్న జీతాలైన వస్తాయా అన్న భయంలో పడ్డారు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు. సీఎం కేసీఆర్ కరోనా వైరస్ పై మాట్లాడుతూ… ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదని, మార్చి 15 నుండి తెలంగాణ ఆదాయం సున్నా అంటూ ప్రకటన చేశారు.
దీనిపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో తెలంగాణ వృద్ధి రేటు 20శాతం వరకు ఉందని ప్రభుత్వమే చెప్పింది, అప్పుడు ఏమైనా జీతాలు పెంచారా…? ఇప్పుడు ఆపటానికి…? అంటూ ప్రశ్నిస్తున్నారు. కేవలం 15 రోజులు ఆదాయం లేకపోతే జీతాలివ్వలేని ధనిక రాష్ట్రమా మన తెలంగాణ, దేశాన్ని సాకుతున్న ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని చెప్పిన ప్రభుత్వం… ఇప్పుడు 15 రోజుల్లోనే జీతాలివ్వలేని స్థితికి దిగజారిపోయిందా అంటూ ప్రశ్నిస్తున్నారు.
దేశవ్యాప్తంగా పనిచేయకపోయినా, ఫ్యాక్టరీలు నడవకపోయినా జీతాలు ఇవ్వాలని ప్రభుత్వమే ఆదేశాలిచ్చి, ఇప్పుడు ప్రభుత్వమే జీతాల్లో కోత పెట్టడం ద్వారా ప్రజలకు, ప్రైవేటు కంపెనీలకు ఏం సమాధానం చెప్పదల్చుకున్నారు…? అని ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రభుత్వం జారీ చేసిన జీవోలకు విరుద్దమని, తన నిబంధనలు తానే పాటించలేని ప్రభుత్వం ఉంటుందా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.