అనేక తర్జనభర్జనలు, అధికారులతో గంటల పాటు సమావేశం తర్వాత ఈ నెల 28వరకు లాక్ డౌన్ పొడిగించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. రాష్ట్రంలో కేసుల తీవ్రత తగ్గినప్పటికీ, రాజధాని నగరంలో కేసుల సంఖ్య పూర్తిగా తగ్గనందున ఈ నిర్ణయం తీసుకుంది.
గ్రేటర్ హైదరాబాద్, చుట్టుపక్కల ఉన్న జిల్లాలో కేసులు ఇంకా వస్తున్నందున ఈ తరుణంలో లాక్ డౌన్ ఎత్తివేయటం ప్రమాదకరమని వైద్యారోగ్యశాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కేంద్రం ఇచ్చిన మినహాయింపులకు అవకాశం ఇవ్వనుంది.
పైగా రంజాన్ మాసం కూడా కావటంతో లాక్ డౌన్ ఏమాత్రం సడలించినా జనం రోడ్ల మీదకు వచ్చే అవకాశం ఉందని, పైగా పండుగ పూట జనం గుమిగూడే అవకాశం ఉన్నందున పొడిగించాలని నిఘా సంస్థలు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి జూన్ 3వరకు అనుకున్నప్పటికీ మే 28వరకు పొడిగించనున్నారు. మే 17 తర్వాత కేంద్రం నిర్ణయాన్ని బట్టి, రాష్ట్రంలో కేసుల తీవ్రతను బట్టి రివ్యూ ఉండబోతుంది.
అయితే… మంత్రివర్గ సమావేశం అనంతరం లాక్ డౌన్ పొడిగింపును సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించబోతున్నారు.