ప్రైవేట్ స్కూళ్లలో పనిచేసే సిబ్బంది ఇబ్బందులను పట్టించుకోకుండా విద్యాసంస్థలను మూసివేసి.. వారి మరణాలకు కారణమై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రభుత్వం.. దిద్దుబాటు చర్యలకు దిగింది. జీవనోపాధి లేక పది మంది వరకు ప్రైవేట్ టీచర్లు బలవంతంగా ప్రాణాలు తీసుకోవడంతో.. చివరికి ఆదుకునేందుకు సిద్ధమైంది.
ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి ప్రతినెలా రూ.2వేల నగదు సాయంతో పాటు కుటుంబానికి 25 కిలోల బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది తమ బ్యాంకు అకౌంటు, వివరాలతో తమ తమ జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. విద్యాశాఖ అధికారుల సమన్వయం చేసుకుంటూ విధివిధానాలను ఖరారు చేయాల్సిందిగా ఆర్ధిక శాఖ కార్యదర్శి శ్రీ రామకృష్ణారావును ఆదేశించింది. మానవీయ దృక్ఫథంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజా నిర్ణయం ప్రభుత్వ విద్యాసంస్థల్లో పనిచేసే దాదాపు 1 లక్షా 45 వేల మంది సిబ్బందికి లబ్ధి చేకూరనుంది.
ఇదిలా ఉంటే నాగార్జున సాగర్‌కు చెందిన ప్రైవేట్ టీచర్ రవికుమార్ రెండ్రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణాన్ని తట్టుకోలేక ఆయన భార్య కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ సాయం ఏదో విద్యాసంస్థలను ఉన్నపళంగా మూసివేయకముందే.. చేసి ఉంటే వారి ప్రాణాలు నిలిచేవని అంటున్నారు పలువురు.