తెలంగాణలో వ్యవస్థలన్నీ ప్రైవేటు పరం చేసే కుట్రలు జరుగుతున్నాయా…? తెలంగాణ రెవెన్యూశాఖను కూడా ప్రైవేటుకు ఇచ్చేయబోతున్నారా…? ఇప్పటికే భూముల లెక్క ప్రైవేటు వ్యక్తుల గుప్పిట్లో ఉందా…? భూముల రిజిస్ట్రేషన్లు పక్కాగా లేని పేదల భూములపై బడా ప్రైవేటు రాబందుల కళ్లు పడ్డాయా…?
కేసీఆర్ సర్కారులో వ్యవస్థలను ప్రైవేటీకరించే పథకం ఊపందుకుంది. ఇప్పటికే ఆర్టీసీని ప్రైవేటీకరిస్తా అంటూ కేసీఆర్ గట్టిగా వాదిస్తున్నారు. అయితే, ఈ నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకుంది కాదని… ఆర్టీసీ ఆపరేషన్స్‌లో ప్రైవేటు సంస్థల జోక్యంతోనే మొదలైందన్న వాదన ఉంది. ఏ రూట్లలో లాభాలున్నాయి, ఏ రూట్లలో వ్యాపారం లాభసాటిగా ఉంటుంది, ఏ రూట్లలో కార్గో, సాధారణ ప్రయాణికులు ఎక్కువగా ఉంటారు, ఏ జిల్లాలోని బంక్‌లు ఎక్కువగా నడుస్తాయి ఇలా ప్రతి సమాచారం ప్రైవేటు సంస్థలకు ఎప్పుడో వెళ్లిపోయింది. ఆ తర్వాతే… ఆర్టీసీ ప్రైవేటీకరణ వైపు అడుగులు పడ్డాయన్నది బహిరంగ రహస్యమే.
ఇప్పుడు ఆర్టీసీ తర్వాత వెంటనే రెవెన్యూపైనే ఫోకస్ ఉందన్న చర్చ మొదలైంది. ఇప్పటికే రాష్ట్రంలో మొత్తం భూములు, సర్వే నెంబర్లు, వ్యవసాయ భూమి ఎంతుంది, అడవులు విస్తీర్ణం, ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, వ్యాపారానికి పనికొచ్చే ప్రభుత్వ భూములు ఏయే జిల్లాల్లో ఉన్నాయి, అడ్రస్ లేకుండా పోయిన వారి భూముల వివరాలు అన్నీ ఇప్పుడు ప్రైవేటు సంస్థల చేతిలోకి వెళ్లిపోయాయి. ఇక వాటి మెయింటెనెన్స్, అక్రమాలు అరికట్టే పేరు మీద మొత్తం వ్యవస్థనే ప్రైవేటుకు ఇచ్చే పన్నాగం సాగుతోందని విమర్శలు మొదలయ్యాయి.
అదే జరిగితే… హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఎంతో విలువైన భూములతో పాటు దేశంలో ఏ రాష్ట్రంలోని విధంగా ఎక్కువగా ప్రభుత్వ భూములున్న తెలంగాణలో భూములు ప్రభుత్వానికి మిగలవని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే క్రమబద్ధీకరణ పేరుతో వేలకోట్ల విలువైన భూములు ప్రభుత్వ పెద్దల అనుచరగణానికి పంచిపెడుతున్నారని, మెరుగైన సేవల పేరుతో ప్రైవేటుకు అప్పగించబోతున్నారని మండిపడుతున్నారు.
ఒక కుక్కను చంపాలంటే… ఆ కుక్కకు పిచ్చి ఉందని ముద్ర వేయాలి. ప్రభుత్వ వ్యవస్థలైన ఆర్టీసీ, రెవెన్యూలను ప్రైవేటుకు ఇవ్వాలంటే వాటిలో అక్రమాలు, నష్టాలు, మెరుగైన ప్రజా సేవల పేరుతో ప్రైవేటుపరం చేయాలి అని విమర్శిస్తున్నారు ఎంపీ రేవంత్ రెడ్డి.
ఇవే కాదు… ఇప్పటికే గ్రేటర్ పరిధిలో రోడ్ల నిర్వహణ, కొత్త రోడ్ల నిర్మాణం కూడా ప్రైవేటుకు అప్పగించేశారు.