ప్రభుత్వం ప్రజలకు జవాబుదారిగా ఉండాలి. అప్పుడే ప్రజాస్వామ్యం మనుగడ సాధ్యం. ఇది అందరూ చెప్పే మాట. ప్రభుత్వం తాను తీసుకునే నిర్ణయాలను ప్రజలకు చెప్పటంలో దాపరికం ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రజలందరికీ కనపడేలా జీవీలోను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతుంది. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ వ్యవస్థకు క్రమంగా చరమగీతం పాడుతోంది తెలంగాణ సర్కార్.
తెలంగాణలో రహస్య జీవోల పాలన సాగుతోంది. చిన్నా చితక బిల్లుల పేమేంట్లు, అధికారుల బదిలీలు మినహా కీలక జీవోలేవీ కనపడటం లేదు. అంతేందుకు స్వయంగా ప్రభుత్వ అధికారులకు పెద్దన్నగా ఉండే సీఎస్ అపాయింట్‌మెంట్ ఆర్డర్ కూడా పబ్లిక్ డోమైన్‌లో లేకపోవటం గమనార్హం.
2014 జూన్ 2 నుండి 2019 ఆగస్టు 15వరకు లక్షకు పైగా జీవోలను జారీ చేసింది. కానీ అందులో 43,462వేల జీవోలను జనానికి కనపడకుండా ప్రభుత్వం దాచిపెట్టిందని ఆర్టీఐ కార్యకర్త వేసిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వులను తెలుసుకునే అధికారం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. జీవోలను పబ్లిక్ డోమైన్‌లో పెట్టాలని హైకోర్టు కూడా ఆదేశించింది. కానీ కోర్టు ఆదేశాలు కూడా ఇప్పటి వరకు అమలు కావటం లేదు. ముఖ్యంగా ఆర్థిక శాఖ సహా కొన్ని ముఖ్యమైన శాఖలు రిలీజ్ చేస్తున్న జీవోలు వెబ్‌సైట్‌లో కనీసం అప్‌లోడ్ కూడా చేయటం లేదు.
రహస్య జీవోలను చూసే అధికారం కేవలం ఆయా సెక్షన్ ఆఫీసర్‌కు మాత్రమే ఉంది. వారికి స్పెషల్‌గా కేటాయించిన పాస్‌వర్డ్‌తో లాగిన్ అయితే మాత్రమే ఆ జీవోలు కనపడుతాయి. స్పెషల్ సీఎస్‌లు, చీఫ్ సెక్రెటరీలు, సెక్రెటరీలకు కూడా రహస్య జీవోలను చూసే అవకాశాలు లేవని తెలుస్తోంది.
ఇదంతా ప్రభుత్వ పెద్దల సూచనలతో సాగుతోందని సచివాలయ వర్గాలంటున్నాయి. ప్రభుత్వం ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటుందని, అయితే వాటి లెక్కలు బయటకు తెలియకుండా ఉండేందుకే ఇలా రహస్య జీవోల పాలన సాగుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.