నియోజకవర్గాన్ని తమ జాగీరుగా భావిస్తూ… అమాయక గిరిజనుల భూములను లాక్కున్నారన్న ఆరోపణలపై జర్నలిస్ట్ రఘు వరుస కథనాలతో బయటపెట్టారు. సూర్యాపేట జిల్లాలోని గుర్రంబోడు భూముల్లో వాలిన గద్దలను భయటకు తీశారు. ప్రశ్నించిన గిరిజనంపై దాడులు చేయటం, అక్రమంగా భూములు ఆక్రమించికుంటున్న అంశాలను ఆధారాలతో సహా రాష్ట్రం మొత్తం తెలిసేలా చేశారు.
జర్నలిస్ట్ రఘు కథనాలతో ప్రతిపక్ష రాజకీయ పార్టీలు గుర్రంబోడు సమస్యను ప్రశ్నించాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆద్వర్యంలో బస్సు యాత్రగా గుర్రంబోడు భూములను పరిశీలించారు. అయితే, ఈ పర్యటనకు బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడగా, కొందరు అక్కడున్న అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు ప్రయత్నించారు. ఈ ఇష్యూని మొత్తం అక్కడే ఉన్న జర్నలిస్ట్ రఘు తన టీంతో కవర్ చేశారు.
కానీ బస్సు యాత్రగా అక్కడికి వచ్చిన బండి సంజయ్ ను బస్సు దిగే సమయంలోనే జర్నలిస్ట్ రఘు అక్రమనిర్మాణాలు, భూములున్న చోటు చూపించి… దాడికి కారణం అయ్యారంటూ బండి సంజయ్, ఎమ్మెల్యే రఘునందన్ కన్నా ముందుగా రఘు కుట్ర పన్నారంటూ పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పైగా ప్రజా సమస్యలను ప్రపంచానికి చూపే జర్నలిస్ట్ పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. దీనిపై జర్నలిస్టు సమాజం తీవ్రంగా స్పందిస్తుంది.
అన్యాయాన్ని ప్రశ్నిస్తూ… జనం సమస్యలను లేవనెత్తటం జర్నలిస్టు కర్తవ్యమని, అలాంటి వ్యక్తిపై అక్రమ కేసులు బనాయించటం కేసీఆర్ సర్కారు దమనకాండకు నిదర్శనమని జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. అక్రమ కేసులకు భయపడే వారు ఎవరూ లేరని… నిఖార్సైన జర్నలిస్టులకు తాము అండగా ఉంటామని హెచ్చరిస్తున్నారు.