పీజీ చదవాలనుకుంటున్న వైద్య విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. కరోనా వైరస్ మహమ్మారీ దాటికి వైద్య విద్య ఎంత అవసరమో ప్రభుత్వాలు లెక్కలేసుకుంటుంటే… తెలంగాణ సర్కార్ మాత్రం పేదోడికి వైద్య విద్యను మరింత దూరం చేసిందనే విమర్శలు మూటగట్టుకుంటుంది. 3.8లక్షల నుండి ఏకంగా 7.75లక్షలకు పెంచింది.
2020-21 సంవత్సరం పీజీ జాయిన్ అయ్యే వైద్య విద్యార్థుల ఫీజులను తెలంగాణ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. మే 5 నుండి మద్యాహ్నం నుండి వెబ్ అప్షన్ ఇచ్చుకునే సమయంలో ఫీజులు పెంచిన జీవోను సోమవారం విడుదల చేసింది. ఏప్రిల్ 14నే జీవో తయారైనా… వెబ్ ఆప్షన్స్ గడువు ముందు రిలీజ్ చేయటం చర్చనీయాంశం అవుతుంది.
3.8లక్షలున్న పీజీ వైద్య విద్యను ఏకంగా 7.75లక్షలకు పెంచింది.2020-2023 మధ్య గల పీజీ కోర్సులు, డెంటల్ కాలేజీలకు ఈ కొత్త ఫీజులు వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ ఫీజు నియంత్రణ సంస్థ సూచనల మేరకు ఫీజులు పెంచుతున్నామని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై వైద్య విద్యార్థులు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. పేదలకు వైద్యవిద్యను అందించాల్సింది పోయి మరింత దూరం చేశారని, ఓ పేద, మద్యతరగతి విద్యార్థి 7.75లక్షల సంవత్సర ఫీజును కడుతూ… 14లక్షల బ్యాంకు గ్యారెంటీ ఎలా తీసుకరాగలడని ప్రశ్నించారు.
వెబ్ ఆప్షన్ల ముందు కొత్త ఫీజులు అని ప్రకటించటం అంటే… 5000-15000మధ్య ర్యాంకులు గల వారికి ఇది శరాఘాత నిర్ణయం అని, ఇందులో చాలా మంది ఫ్రీ సీటు కోసం మరో సంవత్సరం పాటు చదువులు వాయిదా వేసుకునే పరిస్థితి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
ప్రైవేటు కాలేజీల ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం పేద విద్యార్థులను నట్టేట ముంచిందని… ఇప్పటికే 2017-2020 ఫీజుల అంశం కోర్టులో ఉండగా ఇంత హాడావిడి నిర్ణయం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కొత్తగా విడుదల చేసిన జీవోను కూడా కోర్టులో సవాలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామంటున్నాయి విద్యార్థి సంఘాలు.