ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఉమ్మడి రాష్ట్రంలో డీఎస్సీ వేసే వారు. జిల్లా స్థాయిలో సెలక్షన్ కమిటీ ఉండేది. దాన్ని తెలంగాణలో తీసేసి… రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అప్పజెప్పి టీఆర్టీ తీసుకొచ్చారు.
కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొలువుల జాతర నిర్వహించాలని నిర్ణయించింది. వీలైనంత త్వరగా భర్తీ ప్రక్రియను పూర్తి చేసేందుకు శాఖల వారీగా నియామక బోర్డులు ఏర్పాటు చేయాలని సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశమయ్యారు.
అయితే, పబ్లిక్ కమిషన్ ద్వారా నియామక ప్రక్రియ ఆలస్యం అవుతుండటంతో మరోసారి డీఎస్సీ తెరపైకి వస్తుంది. ఇప్పటికే గురుకులాల కోసం ప్రత్యేక బోర్డు ఉన్న నేపథ్యంలో డీఎస్సీ పునరుద్దరించే అవకాశం ఉంది. లేదా రాష్ట్రస్థాయిలోనే టీచర్ల భర్తీకి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ దీనిపై సీఎం కేసీఆర్ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాష్ట్రంలో 20వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని ఉపాధ్యాయ సంఘాలు లెక్కలు కడుతున్న నేపథ్యంలో ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.