తెలంగాణలో నిలిచిపోయిన పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది. ఇప్పటికే మూడు పరీక్షలు నిర్వహించగా… మిగతా పరీక్షల విషయంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్షలు వాయిదా వేశారు.
అయితే… తెలంగాణలో సడలింపులు కొనసాగుతుండటం, కేవలం ఆరు జిల్లాల్లోనే రెడ్ జోన్స్ ఉన్నప్పటికీ త్వరలో రెడ్ జోన్ కేవలం మూడు, నాలుగు జిల్లాలకే పరిమితం అయ్యే అవకాశం ఉండటంతో పరీక్షలు పూర్తి చేసేందుకు తెలంగాణ విద్యాశాఖ సమాయత్తం అవుతోంది.
సెంటర్ల సంఖ్యను భారీగా పెంచి, ఒక్కో రూంలో కేవలం 10-15మందితో భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కోర్టుకు సమాచారం ఇవ్వబోతున్నారు. అయితే… కోర్టుకు సమాచారం ఇస్తూనే, ప్రభుత్వం నిర్ణయించిన పరీక్షల షెడ్యూల్ కూడా కోర్టుకు సమర్పించి, అనుమతి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఇప్పటికే విద్యా సంవత్సరం ఆలస్యం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పరీక్షలు ఆలస్యం చేస్తే విద్యాసంవత్సరంతో పాటు పేపర్ల మూల్యాంకనం కోసం టీచర్లు అవసరం ఉండటంతో పాఠశాల విద్య కూడా ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంటుందని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం మే 27 నుండి పదవ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. పరీక్షలు పూర్తయిన వెంటనే స్పాట్ వాల్యూయేషన్ కూడా చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగానే సీఎం కేసీఆర్ కూడా ఈ నెలలో పదవ తరగతి పరీక్షలు నిర్వహణ మొదలుపెడతమాని చెప్పినట్లు తెలుస్తోంది.