టెస్టుల మాటున తీవ్రత.. తెలంగాణలో భారీగా పెరిగిన కేసులుతెలంగాణపై కరోనా మరింత కోరలు చాస్తోంది. రాష్ట్రంలో ఈ మహమ్మారి ప్రభావం తక్కువగానే ఉందంటూ.. ఇప్పటిదాకా టెస్టులను పెంచకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ వచ్చింది. ఇటీవల హైకోర్టు అక్షింతలతో కదిలిన సర్కార్.. తాజాగా పరీక్షల సంఖ్యను పెంచగా అనూహ్యంగా భారీగా కేసులు బయటపడుతున్నాయి.
గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 1,01,986 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… ఏకంగా 2,478 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. తెలంగాణలో ఈ స్థాయిలో కేసులు బయటపడటం ఇదే మొదటిసారి. మరో 3907 మంది ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,21,182కు చేరింది. అటు కరోనా కారణంగా నిన్న రాష్ట్రంలో మరో ఐదుగురు మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,746కి పెరిగింది.
కరోనా బారి నుంచి తాజాగా 363 మంది కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం రాష్ట్రంలో రికవరీలు 3,03,964కి చేరాయి. ప్రస్తుతం 15,472 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.