కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్ డౌన్ తెలంగాణలో 50 రోజులకు చేరింది. లాక్ డౌన్ కారణంగా వైరస్ వ్యాప్తి పూర్తిగా నివారణ కానప్పటికీ, వ్యాప్తి తీవ్రత తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. అయితే… కేంద్రం ఇచ్చిన సడలింపులను రాష్ట్రంలోనూ అమలు చేస్తున్న తెలంగాణ సోమవారం నుండి మరిన్ని సడలింపులు ఇవ్వబోతుంది.
తెలంగాణలో కేంద్రం ఇచ్చిన రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్ల లిస్ట్ లో మార్పులు జరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం
33జిల్లాల తెలంగాణలో కేవలం మూడు జిల్లాలు మాత్రమే రెడ్ జోన్ లో ఉండబోతున్నాయి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు మినహా మిగతా అన్నీ గ్రీన్ జోన్ లో ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది.
దీంతో 33శాతం ఉద్యోగులతో నడుస్తున్న ప్రభుత్వ కార్యాలయాలన్నీ సోమవారం నుండి పూర్తిస్థాయిలో నడవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 100శాతం ఉద్యోగుల హజరు తప్పనిసరి అని తెలిపింది. రెడ్ జోన్ లో మాత్రం33శాతం కొనసాగుతుందని ప్రకటించింది. ఇక ఇప్పటికే గ్రీన్ జోన్స్, ఆరెంజ్ జోన్స్ లో సరి-బేసి విధానం ద్వారా ప్రతి రోజు 50శాతం షాపులు తెరుచుకునేలా అధికారులు ఏర్పాట్లు చేయగా, మండల స్థాయి నుండి అన్ని షాపులు తెరుచుకుంటున్నాయి.