ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో10 శాతం రిజర్వేషన్ దక్కుతుంది.
ఇప్పటికే వివిధ వర్గాలకు అమలవుతున్న రిజర్వేషన్లను యథాతథంగా కొనసాగిస్తూనే.. రాష్ట్రంలోని ఈడబ్ల్యూఎస్‌లకు పది శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుం రాష్ట్రంలో బలహీనవర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. తాజా వాటితో కలిపి 60 శాతం రిజర్వేషన్లు అమలవుతాయని స్పష్టం చేసింది.
కాగా, ఆర్థికంగా వెనుకబడినవర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం 2019లో 103 వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేస్తుండగా.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ జాబితాలో చేరింది.