తెలంగాణ లో ప్రజలకు మరో పిడుగు లాంటి వార్త చెప్పడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. కరోనా వల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టాన్ని ప్రజల నుంచి ముక్కు పిండి వసూల్ చేయడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే లిక్కర్ ధరలు పెంచిన ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు పెంచేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం 50 నుంచి 75 శాతం వరకు ఆర్టీసీ చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు.
కొన్ని నెలల క్రితమే ఆర్టీసీ సమ్మె వల్ల రెండు నెలలు బస్సు లు డిపోకు పరిమితం అయ్యాయని, దాని వల్ల చాలా నష్టం వచ్చింది, ఆ తరువాత బస్సు ఛార్జీలు పెంచడం తో ఆర్టీసీ మళ్ళీ గాడిన పడింది. లాక్ డౌన్ కారణంగా గత మార్చ్ 21 నుంచి బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. లాక్ డౌన్ వల్ల ఆర్టీసీ కి ఇప్పటికే 750 కోట్ల నష్టం వచ్చింది అంటున్నారు అధికారులు. రోజు కు 12 నుంచి 15 కోట్ల కలెక్షన్ వచ్చేదని, లాక్ డౌన్ కారణంగా సంస్థకు ఆదాయం పూర్తిగా ఆగిపోయిందని అధికారులు అంటున్నారు.
సంస్థకు ఆదాయం రాకపోయినా సగం జీతాలు చెల్లించాల్సి వస్తుంది, వడ్డీలు కడుతున్నారు. కేంద్రం కూడా ఆర్టీసీ బస్సులో సోషల్ డిస్టెన్స్ పాటించమని చెప్తుండడం కూడా చార్జీలు పెంచడానికి కారణంగా అధికారులు చెప్తున్నారు. ఇంతకు ముందు పల్లె వెలుగు బస్సుల్లో 56 మందిని ఎక్కించేవారు, కేంద్ర గైడ్లెన్స్ ప్రకారం కేవలం 26 మంది మాత్రమే ప్రయాణించాలి. ఇద్దరు కూర్చునే సీటులో ఒక్కరే కూర్చోవాల్సి ఉంటుంది. ఇవన్నీ భరించి సంస్థను కాపాడుకోవాలి అంటే చార్జీలు పెంచడం ఒక్కటే మార్గం అంటున్నారు అధికారులు.