తెలంగాణ ప్రజలతో ఆర్టీసీ ఆటలాడుతోంది. ఏ కారణంతో సంస్థకు నష్టం వచ్చినా.. జనం జేబులకే చిల్లుపెడుతోంది. 2019లో సమ్మె కారణంగా నష్టపోయిన ఆదాయాన్ని పూడ్చుకునేందుకు ప్రయాణికులపై చార్జీల భారం మోపిన ఆర్టీసీ.. నష్టం వచ్చినప్పుడల్లా చార్జీలు పెంచడమే లాభాలకు షార్ట్‌కట్‌గా భావిస్తోంది. సంస్థ మనుగడకు ప్రత్యామ్నాయ మార్గాలేవి ఆలోచించకుండా.. ప్రయాణికులనే టార్గెట్ చేస్తోంది.
తాజాగా డీజిల్ ధరల పెంపు, లాక్‌డౌన్ కారణంగా నష్టాలు వచ్చాయన్న సాకుతో.. మరోసారి ఛార్జీల పెంపునకు తెలంగాణ ఆర్టీసీ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుంచింది. ప్రభుత్వం సాయం చేయడం, బస్సు చార్జీలు పెంచితే తప్ప సంస్థపై ఆర్థికభారం తగ్గే అవకాశమే లేదని నివేదించింది. ఇక ఉద్యోగుల వేతనాలు పెంచితే సంస్థపై మరింత ఆర్థికభారం పెరుగుతుందని.. దాన్ని భరించే స్థితిలో ఆర్టీసీ లేదని వివరించింది. ఫైనల్ ఛార్జీల పెంపు తప్ప మరో మార్గం లేదని తేల్చేసింది.
ఆర్టీసీని ఎలా లాభాల్లోకి తీసుకురావాలో తనకు తెలుసని, కార్మికులు తాను చెప్పినట్టు చేస్తే చాలని ముఖ్యమంత్రి కేసీఆర్.. సమ్మె విరమణ సందర్భంగా చెప్పుకున్నారు. కానీ ఎన్ని చెప్పినా.. చివరికి ప్రయాణికులపై చార్జీలు బాదేస్తే తప్ప ఆర్టీసీ హారన్ మోగేలా లేదని అధికారులు ఇప్పుడు చేతులెత్తేశారు. మరి ముఖ్యమంత్రి ఏమంటారో?