కరోనా వైరస్ కట్టడి కోసం తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ లో కరోనా వ్యాప్తి అంతకంతకు పెరిగి పోతున్న నేపథ్యంలో లాక్ డౌన్ కు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. కానీ ఉగాది పండుగ సందర్భం కావటం, హైదరాబాద్ వంటి ప్రాంతంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో జనం సొంత ఊర్లకు పయనం అవుతున్నారు. నిషేధాజ్ఞలు లెక్కచేయకుండా వందలాది వాహనాలు రోడ్ల మీదకు వస్తున్నాయి. దీనితో ఇలా అయితే కరోనా వ్యాప్తి అరికట్టడం ఇబ్బంది అని భావించిన సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటి వరకు కేవలం అంతరాష్ట్ర సరిహద్దులు మాత్రమే మూసివేయగా…. మంగళవారం ఉదయం నుండి జిల్లాల సరిహద్దులు సైతం మూసివేశారు. వాహనాలను అనుమతించడం లేదు. ప్రజలు రోడ్లపైకి రావొద్దంటూ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక నుండి జనం వినకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తూ… పికెటింగ్ ఏర్పాటు చేశారు.