నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్‌లైన్‌గా సాగిన తెలంగాణ ఉద్యమంలో… నియామకాల కోసం నిరుద్యోగ అభ్యర్థులు ఎదురు చూస్తూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుండి చిన్న చిన్న ఉద్యోగాల నోటిఫికేషన్లు వేశారు కానీ ఇప్పటి వరకు కీలకమైన పోస్టుల భర్తీకి అసలు చర్యలే తీసుకోవటం లేదు. దీంతో… వయస్సు మీద పడిపోయి, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుండి ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా గ్రూప్-1 పోస్టుల భర్తీకి చర్యలే తీసుకోలేదు ప్రభుత్వం. దాదాపు 138 పోస్టులు గుర్తించామని టీఎస్పీఎస్సీ జూన్2,2018న ప్రకటించింది. ఆ తర్వాత మరిన్ని పోస్టుల్లో ఖాళీలు వచ్చాయి కానీ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నుండి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. గ్రూప్-2 పోస్టులు కూడా ప్రభుత్వం ఏర్పడి ఆరేళ్లు పూర్తయిన సందర్భంలో ఎట్టకేలకు అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు.
ఇప్పటికే ఏపీలో టీచర్ల భర్తీ రెండుసార్లు చేశారు. మూడోసారి ప్రక్రియ మొదలుపెట్టబోతున్నారు. కానీ తెలంగాణలో మాత్రం విభజన తర్వాత కేవలం ఒక్కసారి మాత్రమే 8వేల లోపు ఉద్యోగాలు భర్తీ చేశారు. అందుకు దాదాపు రెండు సంవత్సరాల కాలం లాగించారు. కానీ 2017 మధ్యలో నుండి ఖాళీ అయిన ఉద్యోగాలను ప్రభుత్వం పట్టించుకోవటమే లేదు. పైపెచ్చు ఉన్న పాఠశాలలను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇక కొత్త జిల్లాల ఏర్పాటు, కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటుతో భారీగా ఉద్యోగాల అవసరం ఉంది. కానీ వాటిపై ఇంతవరకు ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. దీంతో… నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.
సీఎం కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఒక్క పంచాయితీ సెక్రెటరీలు మినహా చెప్పుకొదగ్గ పోస్టులేవీ భర్తీ ప్రక్రియను మొదలుపెట్టనే లేదనే విమర్శలు ఉన్నాయి.
కొంతకాలం జోనల్ నిబంధనలు అడ్డువచ్చాయని కాలయాపన చేశారు, తర్వాత మల్టీ జోనల్ ఉత్తర్వుల కోసం వేచి చూడటంతో… నిరుద్యోగులు ఆవేదనతో ఇంకెంత కాలం అంటూ ప్రశ్నిస్తున్నారు. కనీసం ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేసినా… మేం చదువుకోవాలో లేదా అయినా నిర్ణయించుకుంటాం కదా అని ప్రశ్నిస్తున్నారు. తన ఆప్తమిత్రుడు జగన్‌ను చూసైనా కేసీఆర్ నేర్చుకోవాలి అంటూ మండిపడుతున్నారు.
అయితే, అసలే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణలో ఇప్పట్లో కొత్త ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉంటుందనేది అనుమానంగా ఉందంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.
ప్రధానితో తెలంగాణ బీజేపీ ఎంపీలు