లూటీ అయిన ధనిక రాష్ట్రం - Tolivelugu

లూటీ అయిన ధనిక రాష్ట్రం

telangana govt stops all new projects and tenders for non availability money and deficit, లూటీ అయిన ధనిక రాష్ట్రం

తెలంగాణలో ప్రాజెక్టులు బంద్ కాబోతున్నాయా…? కొత్త రోడ్లు ఇప్పట్లో లేనట్లేనా…? కొత్త ప్రాజెక్ట్‌లు ఇక అటకెక్కినట్లేనా…? కాంట్రాక్టర్లు బిల్లుల కోసం వేచి చూడాల్సిందేనా…? త్వరలో ప్రజలపై భారీ వడ్డన ఉండబోతుందా…? అంటే అవుననే అంటున్నాయి తెలంగాణ సచివాలయ వర్గాలు.

ప్రతి సంవత్సరం సాగునీటి కోసం 25వేల కోట్లు ఖర్చు చేస్తాం, ప్రతి మండల కేంద్రం నుండి మరో మండల కేంద్రానికి డబుల్‌ రోడ్లు, ప్రతి పల్లెకు పక్కా రోడ్లు… మనది దేశాన్ని సాదుతోన్న రాష్ట్రం. మస్తు పైసలున్నయి… ఈ మాటలు అన్నది ఎవరో కాదు. స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. కానీ ఇప్పుడది గతం. అవును… ప్రస్తుతం నిధులకు తెలంగాణలో తీవ్ర ఇబ్బంది ఉంది.

ఇప్పటికే ఇరిగేషన్‌లో 10వేల కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బిల్లులు ఇప్పుడప్పుడే చెల్లించే పరిస్థితి లేదు. కొత్త ప్రాజెక్టులను హోల్డ్‌లో పెట్టండని ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. కొత్త రోడ్లకు కూడా నిధులు లేవని ఆర్థిక శాఖ తేల్చి చెప్పిందని తెలుస్తోంది. కార్పొరేషన్ల నుండి కూడా లోన్లు తీసుకునే పరిస్థితి లేదని, తిరిగి చెల్లించలేని పరిస్థితి తలెత్తబోతుందని ఆర్థిక శాఖ సీఎంవో వర్గాలను హెచ్చరించిందని కథనాలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఇరిగేషన్‌లో జరుగుతోన్న 15వేల కోట్ల పనులకు కూడా బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.

కాళేశ్వరంలో 2వేల కోట్లు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో 1600కోట్లు, మైనర్‌ ఇరిగేషన్‌లో 700కోట్ల వరకు పెండింగ్‌లో ఉండగా… కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లోయర్‌ మానేర్ కింది నుండి మల్లన్నసాగర్‌ వరకు అంచనా వేసిన 5000కోట్ల పనులకు టెండర్లను నిలుపుదల చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే జూన్‌లో విడుదల చేయాల్సిన రైతుబంధు పథకం డబ్బు ఇంకా ఇప్పటికీ చాలా మందికి చేరనే లేదు. పైగా మరో విడత చెల్లించాల్సిన వాయిదా వచ్చేస్తోనే ఉంది.

ఇక పెంచిన ఫించన్లు, ఇతర నిత్యావసరాల కోసం చేసే వ్యయంలో మాత్రం కోత విధించవద్దని… అవి కూడా ఆగిపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ప్రభుత్వ పెద్దలు ఆర్థిక శాఖకు సూచించినట్లు సమాచారం.

Share on facebook
Share on twitter
Share on whatsapp