ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 1897 చట్టం కింద లాక్ డౌన్ ను అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. ఈ చట్టం కింద ఎమర్జెన్సీ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయన్నారు. ఎక్కడైనా 5 గురు కంటే ఎక్కువ మంది గుమికూడవద్దన్నారు. నిత్యావసర దుకాణాలు మాత్రం తెరిచి ఉంటాయని…జీవో 45 లోని ప్రతి అంశాన్ని కచ్చితంగా అమలు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెల్లడిచారు. రోడ్ల మీద ఎలాంటి వాహనాలు తిరగడానికి వీలు లేదని..రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఎవ్వరు బయట తిరిగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విదేశీయులు బయట తిరగవద్దని కోరారు.
డీజీపీ మహేందర్ రెడ్డి :
కరోనా వైరస్ తీవ్ర రూపం దాలుస్తున్నందున ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ప్రజలను కోరారు. వచ్చే వారం రోజులు క్రమశిక్షణతో ఉండాలని…ప్రజలెవరూ రోడ్లపైకి రావొద్దన్నారు. తెలంగాణ సమాజం కోసం ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నామని..అజాగ్రత్తగా ఉంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని..ప్రతి వాహనాన్ని చెక్ చేస్తామని..ఎక్కువ సార్లు తిరిగితే వెహికిల్ సీజ్ చేస్తామని చెప్పారు. ఒక్కో బైక్ పై ఒక్కరికి, ఫోర్ వీలర్ పై ఇద్దరికి మాత్రమే అనుమతిస్తామని…సోమవారం మధ్యాహ్నం నుంచి కఠినంగా అమలు చేస్తామని చెప్పారు.