మరోసారి టీచర్లు రోడ్డెక్కారు. ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో ఆ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జీవో 317ను సవరించి ఎవరి జిల్లాకు వారిని కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు ఉపాధ్యాయులు. ఈ క్రమంలోనే ప్రగతి భవన్ ను ముట్టడించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొన్నారు.
జీవో 317 వల్ల కుటుంబానికి దూరం అవుతున్నామని ప్రభుత్వ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భార్యభర్తలను ఒకే జిల్లాకు బదిలీ చేయాలంటూ ధర్నాకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రెండోరోజు కూడా ప్రగతి భవన్ కు క్యూ కట్టారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు.
అరెస్ట్ చేసిన వారిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా సైలెంట్ గా ఉండటాన్ని టీచర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇకనైనా ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి వత్తాసు పలకకుండా తమకు న్యాయం చేసేందుకు కృషి చేయాలని కోరుతున్నారు.
317 జీవో వల్ల 2017 బ్యాచ్ మొత్తం నరకం అనుభవిస్తున్నారని, చదివింది ఒక జిల్లా అయితే.. ఉద్యోగం వందల కిలోమీటర్ల దూరంలో ఉందని వాపోతున్నారు. ప్రతీ రోజు ప్రయాణం చేసి అనారోగ్యంతో బాధపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన చీకటి జీవోను వెంటనే రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు టీచర్లు. అరెస్ట్ అయిన పోలీస్ స్టేషన్ల దగ్గర కూడా తమ నిరసనను కొనసాగిస్తున్నారు.