ఇక నుండి తెలంగాణలో ఉన్న అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాల ప్రసాదాలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదట యాదగిరిగుట్ట లక్ష్మినరసింహస్వామి ప్రసాదాలు, లడ్డూ, అక్షింతలు, కుంకుమను నేరుగా భక్తుల ఇంటికి చేర్చేలా నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం తపాలా శాఖతో సమన్వయం చేసుకుంటూ… స్పీడ్ పోస్టులో ప్రసాదాలు అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఒక్క యాదాద్రి మాత్రమే కాదు… బాసర, భద్రాచలం, వేములవాడతో పాటు మరో 10దేవాలయాల నుండి భక్తులు కోరుకున్న ప్రసాదాన్ని డోర్ డెలివరీ ఇచ్చేలా అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఈ ప్రసాదాల అమ్మకానికి రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రత్యేక యాప్‌ను కూడా రూపోందించబోతుంది. అంతేకాదు… ఈ యాప్‌లోనే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో చెల్లింపులు కూడా చేసుకోవచ్చని తెలుస్తోంది.
ఫిబ్రవరి నెలాఖరు నుండి ఈ యాప్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోండగా… ప్రసాదాల బరువును బట్టి పోస్టల్ శాఖ చార్జ్ వసూలు చేయబోతుంది.
అయితే, ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే స్వామి వారి ప్రసాదాన్ని అలా ఆన్‌లైన్‌లో పెట్టి అమ్మాలన్న ప్రభుత్వ నిర్ణయం పై కొందరు భక్తులు పెదవి విరుస్తున్నారు.