ఆదివారం జరిగిన గ్రూప్ -1 పరీక్ష తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. 503 పోస్టుల భర్తీకి జరిగిన ఈ పరీక్ష కోసం టీఎస్ పీఎస్సీ భారీగా ఏర్పాట్లు చేసింది. సెంటర్ల విషయంలో చివరి నిమిషంలో అభ్యర్థులు తడబడ్డారు.
నూతనంగా ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విషయంలో చాలా ఆలస్యమైంది. ట్యాబ్ లలో ఛార్జింగ్ లేకపోవడం, మరికొన్ని స్లోగా ఉండడంతో అటెండెన్స్ తీసుకోవడంలో ఆలస్యమైంది. చెప్పిన టైంలోపల ఎగ్జామ్ సెంటర్ గేట్ లోనికి వెళ్లిన వారిని అనుమతించారు.
10.15 నిమిషాలకు సెంటర్ లోపలికి వెళ్లాలన్న రూల్ ను అధికారులు కఠినంగా అమలు చేశారు. కొందరు అభ్యర్థులు చివరి నిమిషంలో ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వర్షం కారణంగా కొందరు అభ్యర్థులు లేట్ అయ్యారు. మరికొందరికి సెంటర్ అడ్రస్ లు సరిగా దొరకకపోవడంతో ఆలస్యమయ్యారు.
దీంతో వారందరినీ తిప్పి పంపారు. కొందరు అభ్యర్థులైతే కొన్ని సెకన్ల గ్యాప్ తో ఎగ్జామ్ మిస్ అయ్యారు. గతంలో 1 నిమిషం నిబంధన ఉండేదని, ఇప్పుడు 15 నిమిషాల లేట్ రూల్ తీసుకొచ్చారని ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులు అంటున్నారు. తాము టైంకే వచ్చినా లోపలికి అనుమతించలేదని ఆబిడ్స్ స్టాన్లీ కాలేజ్ దగ్గర అభ్యర్థులు వాపోయారు.