తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారి గ్రూప్ -1 నోటిఫికేషన్ కు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష ఈరోజు (ఆదివారం) జరుగుతోంది. పరీక్షకు ఎలాంటి అవాంతరాలు లేకుండా పకడ్భందీగా నిర్వహించేందుకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
పరీక్ష ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతోంది. భారీ బందోబస్తు… కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు ఇప్పటికే అధికారులు తెలిపారు. పరీక్ష 10:30 గంటల నుంచి అయినప్పటికీ ఉదయం 8:30 గంటల నుంచే లోపలికి అభ్యర్థులను అనుమతించనున్నారు.
మొట్ట మొదటి సారి బయోమెట్రిక్ వివరాలను సేకరించనున్న నేపథ్యంలో ముందుగా అభ్యర్థులను అనుమతించనున్నారు. అయితే పరీక్షకు 15 నిమిషాల ముందే గేట్లు మూసివేయనున్నట్లు బోర్దు ప్రకటించింది. సమయం ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థులను లోనికి అనుమతించేది లేదని స్పష్టం చేసింది.
వరంగల్ లో నేడు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు సెక్షన్ అమలులో ఉంటుంది. పరీక్ష కేంద్రానికి సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని సీపీ తరుణ్ జోషి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 27 పరీక్షా కేంద్రాల్లో 9,716 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారు. పరీక్ష హాల్ టికెట్లు, కేంద్రాలపై సమాచారం, సందేహాల నివృత్తి కోసం ప్రత్యేకంగా కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు.
హన్మకొండ జిల్లా నుంచి 21,024 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. 49 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో పరీక్షకు వచ్చే అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్న ఆర్టీసీ. సంగారెడ్డి జిల్లాలో 26 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు.
మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 28,661 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. 92 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో 12,126 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
34 పరీక్షా కేంద్రాల ఏర్పాటు. వనపర్తి జిల్లాలో 4,343 మంది అభ్యర్థులు,16 పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేసిన అధికారులు. జోగులాంబ గద్వాల జిల్లా 4,874 మంది అభ్యర్థులకు 15 పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేసిన అధికారులు. నాగర్ కర్నూలు జిల్లాలో 5,134 మంది అభ్యర్థులుకు 20 పరీక్షా కేంద్రాల ఏర్పాటు.నారాయణపేట జిల్లాలో 2,184 మంది అభ్యర్థులుకు 7 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు.
అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, పరీక్షల నిర్వహణ పర్యవేక్షించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డును వెంట తీసుకు రావాల్సి ఉంది. పరీక్ష రాసే అభ్యర్థులు కేవలం చెప్పులను మాత్రమే ధరించాలి. షూస్‌ను ధరించవద్దని అధికారులు ముందుగానే సూచించారు.