తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం నిర్వహించే గ్రూప్ -1 పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 16న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించే పరీక్షకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. మెదక్ జిల్లాలో 3,293 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.
గ్రూప్-1 టెస్ట్ కోసం జిల్లాలో 7 కేంద్రాలను ఏర్పాటు చేయగా, నలుగురు జోనల్ ఆఫీసర్లు, ఐదుగురు లైజనింగ్ ఆఫీసర్లు, 9 మంది అసిస్టెంట్ లైజనింగ్ ఆఫీసర్లు, మూడు ఫ్లైయింగ్ స్వా డ్ బృందాలను నియమించారు. 60 మంది వి ద్యార్ధులకు ఒక బయోమెట్రిక్ యూనిట్‌ను ఏర్పా టు చేశారు.
మొత్తం నాలుగు రూట్లు ఉండగా, రెండు మెదక్‌లో, నర్సాపూర్‌లో ఒకటి, తూప్రాన్‌లో రెండు రూట్లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు మొదటిసారిగా బయోమెట్రిక్ విధానం ద్వారా అభ్యర్థులను నిశితంగా పరిశీలించి, కేంద్రాలకు అనుమతించాలని నిర్ణయించింది. కాబట్టి అభ్యర్థులు ఉదయం 8.30 గంటల నుంచే పరీక్ష కేంద్రాలకు అనుమతించనున్నారు. సమస్యలు, సందేహాల నివృత్తికి జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా ఫోన్: 81069 99625, 93919 42254 నంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు మెదక్ కలెక్టర్ హరీశ్ తెలిపారు.
ఈ నెల 16న నిర్వహించబోయే గ్రూప్-1 పోస్టుల నియామక ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాలో ఏర్పాటు చేసిన 7 పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ప్రతి పరీక్షా కేంద్రం చుట్టూ 360 డిగ్రీల్లో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పేర్కొన్నారు.
గ్రూపు-1 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పరీక్షల చీఫ్ సమన్వయ అధికారి, జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని పరీక్షల చీఫ్ సమన్వయాధికారి, జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ తెలిపారు.
ఈ నెల 16న జిల్లాలో జరిగే గ్రూప్-1 పరీక్షను పారదర్శకంగా నిర్వహించాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నిన్న కలెక్టరేట్‌లో గ్రూప్-1 పరీక్ష నిర్వహణ, ఏర్పాట్లపై సంబంధిత అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ అధికారులు, అసిస్టెంట్ లైజన్ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షకు ఎలాంటి పొరపాట్లు లేకుండా జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాలో 26 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, మొత్తం 8,654 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్టు వెల్లడించారు. సంగారెడ్డి, సదాశివపేట, పటాన్‌చెరు, రామచంద్రపురంలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
అభ్యర్థులు పరీక్ష రాసేందుకు 16న ఉదయం 8.30 గంటలకే పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. అభ్యర్థులు ఆయా పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునేలా బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. సమావేశంలో సంగారెడ్డి అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి రాధికా రమణి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, ఆయా శాఖల అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.