వివాదాల్లో ఎప్పుడూ ఉండే తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావ్ ముగ్గుల పోటీలకు సంబంధించి ట్విట్టర్ లో ప్రకటన చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. సంక్రాంతి సందర్భంగా ముగ్గుతో సెల్ఫీ తీసి వాట్సప్ పంపి.. బంగారం గెలుచుకోండంటూ ట్వీట్ చేశారు.
విజేతలకు లక్కీ డ్రా ద్వారా బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఇందులో మొదటి 10 మందికి బహుమతిగా ఒక గ్రామ్ గోల్డ్.. తర్వాతి 50 మంది విజేతలకు 10 గ్రాముల వెండి నాణెం ఇస్తామని వెల్లడించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలో డీజీఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సెల్ఫీ విత్ రంగోలి అనే కార్యక్రమం చేపడుతున్నామన్నారు జిల్లాలోని మహిళలు, యువతులు అందరూ ఈ పోటీల్లో పాల్గొని గోల్డ్ కాయిన్ ను గెలుచుకోవచ్చన్నారు.
పండుగకు మీ ఇంటి ముందు మీరు వేసిన ముగ్గుతో సెల్ఫీ లేదా సెల్ఫీ వీడియో తీసి మీ పేరు, గ్రామం, మండలం వివరాలతో జనవరి 15 సాయంత్రం 6 గంటల లోపు వాట్పాప్ చేయాలన్నారు. ఇందులో లక్కీ డ్రా ద్వారా ఎంపికైన మొదటి 10 మంది విజేతలకు ఒక గ్రాము గోల్డ్, తర్వాతి 50మంది విజేతలకు 10 గ్రాముల వెండి నాణెం. 100 కన్సోలెషన్ బహుమతులు ఇస్తామని చెప్పారు. విజేతలకు జనవరి 26న కొత్తగూడెంలోని శ్రీనగర్ కాలనీలో సాయంత్రం 5 గంటలకు బహుమతి ప్రదానం చేస్తామంటూ.. డీహెచ్ ప్రకటన చేశారు.
అయితే గతంలో చాలా సార్లు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావ్ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. పానీ పూరీ కారణంగానే కరోనా అని చెప్పి కరోనా సమయంలో హడలెత్తించారు. ఇక ఇది పక్కన పెడితే.. యేసు క్రీస్తు కృప వల్లే కరోనా నుంచి బయటపడ్డాం అని మరో వివాదంలో ఆయన చిక్కుకున్నారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే లేపాయి. దీంతో పాటు రాష్ట్రంలో 8 కొత్త మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ వర్చువల్ గా ప్రారంభిస్తున్న సమయంలో శ్రీనివాస్ కేసీఆర్ కాళ్లకు మెక్కారు . దీంతో టికెట్ కోసమే కేసీఆర్ కాళ్లకు మొక్కారంటూ ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ విషయంలో వివరణ ఇచ్చిన శ్రీనివాసరావ్ సీఎం కేసీఆర్ తెలంగాణ జాతి పిత అని ఒక్క సారి కాదు వంద సార్లైనా మొక్కుతానని చెప్పారు.