ఎప్పుడూ వివాదాల్లో ఉండే తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను బట్టి త్వరలోనే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నట్టుగా స్పష్టం అవుతుంది. ఇక కొత్త గూడెం కేంద్రంగా ఆయన చక్రం తిప్పుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజక వర్గం సుజాత నగర్ లో జిఎస్ఆర్ ట్రస్ట్ తరపున ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుజాత నగర్ కొత్తగూడెం నియోజకవర్గానికి ముఖ ద్వారమని.. ప్రజల ఆశీస్సులుంటేనే కొత్తగూడెం నియోజక వర్గంలో గెలుపు సాధ్యమన్నారు.
కొత్తగూడెంలో వనరులు పుష్కలంగా ఉన్నా.. ప్రజాప్రతినిధులు సక్రమంగా వినియోగించుకోవడం లేదని.. అందుకే కొత్తగూడెం వెనుకబడి పోయిందని ఆరోపించారు. కొత్తగూడానికి మార్పు అవసరం అని..దానికి కొత్త నాయకత్వం అవసరమని, ఆ దిశగా అందరూ ముందుకు వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. మహాభారత యుద్దానికి ముందు పాండవులు అరణ్యవాసం చేశారని.. ఆ తర్వాత యుద్ధం ఆరంభమైందని..ఇప్పుడు ఇక్కడ కూడా చూసుకుందామని.. ఆయన హెచ్చరించారు.
అయితే తనకు జెండా లేదు ఎజెండా లేదని మీరు ఏదంటే ఆ పార్టీయే తనదని శ్రీనివాస్ స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో ఆయన పోటీకి సిద్ధ పడుతున్నట్టుగా పరోక్షంగా చెప్పారు. కొంత మంది తాము చేస్తున్న మంచి కార్యక్రమాలకు మానవత్వాన్ని మర్చి పదే పదే అడ్డుపడుతున్నారని.. కొత్తగూడెం బిడ్డగా ప్రాణం ఉన్నంత వరకు సేవాకార్యక్రమాలు చేస్తూనే ఉంటానని శ్రీనివాస్ అన్నారు.